రాష్ట్రంలో సంచలనం రేపిన జిక్సిన్ సిలిండర్ల కంపెనీ ఎండీ రాహుల్ హత్య కేసు (rahul murder case) దర్యాప్తును ఓ కొలిక్కి తెస్తున్నారు విజయవాడ పోలీసులు. నిందితుడు కోగంటి సత్యంను.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విచారణలో కోగంటి నివ్వెరపోయే నిజాలను బయటపెట్టారు. తన కుమార్తె వైద్య సీటు కోసం గాయత్రి.. రాహుల్‌కు 6 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ మొత్తాన్ని రాహుల్ తిరిగి ఇవ్వనందుకు.. అతన్ని హత్య చేయించాలని పథకం పన్నింది. ఆమేరకు కోగంటి, కోరాడతో కలిసి హత్యకు వ్యూహరచన చేసింది. నిందితులంతా కొత్త సెల్ ఫోన్‌లు ,సిమ్ కార్డులు తీసుకొని.. వాటి ద్వారానే హత్యకు సంబంధించిన విషయాలను మాట్లాడుకున్నారని విచారణలో పోలీసులు గుర్తించారు. రాహుల్‌ను ఎలా ఇంటి నుంచి బయటకు రప్పించాలి.. ఎక్కడ హత్య చేయాలనే విషయాలపై ముందే పథక రచన చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాహుల్‌ను మొదట కోరాడ ఫైనాన్స్‌కు పిలిపించి.. అక్కడ అతనిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత గాంధీనగర్ లోని దుర్గా కళామందిర్‌కు తీసుకెళ్లి.. అక్కడ కోగంటి సత్యం సమక్షంలో మరోసారి దాడి చేశారు. తనకు ఇవ్వాల్సిన 6 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో.. కంపెనీలో రాహుల్‌కు సంబంధించిన కొంత వాటాను గాయత్రి …తన కుమార్తె ,అల్లుడు పేర్లపైకి మార్పించుకొంది. కొంత వాటాను కోరాడ విజయ్ కుమార్.. తన పేరు మీద రాయించుకున్నారు. ఆ తర్వాత పథకం ప్రకారం రాహుల్‌ను కారులో తీసుకెళ్లి.. హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో కోరాడ ఫైనాన్స్, దుర్గా కళామందిర్, సంఘటనా స్థలం, సత్యందొడ్డి ప్రాంతాలు కీలకం. ఒక చోటకు వచ్చిన నిందితులు మరోచోటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. నాలుగు ప్రాంతాల్లో ఎవరెవరు ఉండాలి? ఏపని చేయాలి ? అనే విషయాలు నిందితులు ఫోన్లలోనే మాట్లాడుకున్నారని విచారణలో బయటపడింది.