Honor Killing in Sangareddy : ‘ప్రేమ పేరుతో పరువు తీస్తోంది.. ఇతర సామాజిక వర్గానికి చెందినవాడితో తగదని వారించినా మార్పులేదని’ భావించిన కసాయి తల్లి కన్న కూతురునే ప్రియుడితో కలిసి హత్యచేసింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెలిల్లో సోమవారం సంచలనం రేకిత్తించిన దళిత మైనర్ బాలిక హత్య ఘటనలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఈ సందర్భంగా గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఘటన వివరాలను డీఎస్పీ శంకర్ రాజు, సీఐ రాజశేఖర్ వెల్లడించారు.
పది రోజుల ముందే ప్రణాళిక..
కూతురును హత్య చేసేందుకు తల్లి బుజ్జమ్మ తన ప్రియుడు నర్సింహులుతో పది రోజులు ముందే ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఆదివారం రాత్రి కూతురు(16)ను హత్య చేసేందుకు నిర్ణయించుకున్న తల్లి, ఆమె ప్రియుడు మద్యం తాగారు. కూతురు ప్రేమిస్తున్న అదే గ్రామానికి చెందిన ఫకీర్ అఫ్సర్.. మామిడి తోటలో ఉన్నాడని, అతనితో మాట్లాడి నీ సమస్య పరిష్కరిస్తానని నమ్మించి కూతురిని తీసుకొని వెళ్లింది తల్లి. అయితే.. పథకం ప్రకారం అప్పటికే అక్కడికి చేరుకున్న నర్సింహులు.. అఫ్సర్ తో ప్రేమ మానుకోవాలని బాలికపై ఒత్తిడి తెచ్చారు. వారి మాటలు వినకుండా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో.. బాలికను అంతం చేశారు. తల్లి బాలిక కాళ్లపై కూర్చోగా.. నర్సింహులు బాలిక మెడలోని చున్నీని గొంతుకు బిగించి హత్య చేశారు.
ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసిన తల్లి!
Honor Killing in Sangareddy: నవమాసాలు మోసి.. కనీపెంచిన ఆ తల్లే కూతురి పాలిట యమపాశంలాగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. కంటిపాపలా కాపాడుకోవాల్సిన ఆమే.. బిడ్డ ఉసురు తీసింది. మమతకు మారుపేరైన కన్నతల్లి.. వేరే సామాజిక వర్గం యువకుడిని ప్రేమించిందన్న కారణంతో తన గారాలపట్టీని మట్టుబెట్టింది. తన ప్రియుడితో కలిసి కుమార్తెను హతమార్చి.. ఆపై వేరే వ్యక్తిపై నేరం మోపేందుకు యత్నించింది. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికింది.
నమ్మించేందుకు మెత్తల అబద్ధం..
ఈ నేరం.. బాలికను ప్రేమించిన వ్యక్తిపై మోపేలా ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ముందుగా అఫ్సర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం బాలిక తల్లి ఫోన్ కాల్ డేటా సహా హత్య జరిగిన చోట సిగ్నళ్ల సాంకేతికత ఆధారంగా నిందితుడు నర్సింహులును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో.. అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటను ప్రతిష్ఠాత్మకంగా భావించి నిందితులను పట్టుకున్న సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ రవిగౌడ్, శ్రీకాంత్‌లను డీఎస్పీ అభినందించారు. నిందితురాలు బుజ్జమ్మ (45), ఆమె ప్రియుడు ఖాసీంపూర్ గ్రామానికి చెందిన గొల్ల నర్సింహులు (48)ను బుధవారం అరెస్టు చేశారు. ఏ-1గా నర్సింహులును చేర్చిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తల్లిని ఏ-2గా చూపుతూ హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:గోరంట్ల మేజర్ కాల్వలో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం