ఒక్కోటి రూ.20వేలకు పైగా పలికే విదేశీ మద్యం సీసాలను విజయవాడ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయించేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ముఠా నిర్వహిస్తున్న అమ్మకాలపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)కు సమాచారం అందింది. సెబ్ అదనపు ఎస్పీ, జాయింట్ డైరెక్టర్ ఎం.సత్తిబాబు ఆదేశాల మేరకు మూడు రోజులుగా నగరంలో నిఘా ఉంచారు. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులను విదేశీ మద్యం సీసాలతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మాచవరం డౌన్‌లోని ఒక ఇంటిపై మెరుపుదాడులు చేశారు. అక్రమంగా దాచి ఉంచిన రూ.7లక్షల విలువైన 108 విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై నుంచి తీసుకువస్తూ..
విజయవాడలో విదేశీ మద్యానికి అధికంగా డిమాండ్ ఉండటం, లాభాలు వస్తుండటంతో కొందరు దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఈ ముఠా చెన్నై వెళ్లి అక్కడ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న మద్యం కొనుగోలు చేస్తారు. తనిఖీల్లో పట్టుబడకుండా కారులో రహస్య అరలను తయారు చేయించి, వాటిలో ఉంచి విజయవాడకు తీసుకువస్తున్నారు. దీనిపై స్పష్టమైన సమాచారం రావటంతో సెబ్ ఈస్ట్ సీఐ కృష్ణకుమార్, ఇంటెలిజెన్స్ సీఐలు కె.విద్యాసుధాకర్, ఎస్సై హుస్సేన్‌లు మూడు రోజులుగా విజయవాడలో నిఘా ఉంచారు. మంగళవారం రాత్రి గవర్నర్‌పేట పీఎస్ పరిధిలో ఇద్దరిని పట్టుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మాచవరంలోని వెలంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేసి, 108 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వెలంపల్లి శ్రీనివాస్, ఎం.భాస్కరరావు అనే ఇద్దరు వ్యక్తులను సెబ్ అదుపులోకి తీసుకుంది.