తొలి ఏకాదశి పండుగ కోసం ద్విచక్ర వాహనంపై కుటుంబమంతా కలిసి బయల్దేరింది. మరి కొద్ది గంటల్లో.. తల్లిగారి ఇంటికి చేరుకుంటామని ఆ గృహిణిలో ఆనందం.. అమ్మమ్మ, తాతయ్య వాళ్లింట్లో హాయిగా ఆడుకోవచ్చని ఆ దంపతుల ఇద్దరు పిల్లల్లో ఉత్సాహం.. వారిని సంతోషంగా ముందుకు కదిలించింది. కానీ.. వారంతా ఒకలా తలిస్తే.. విధి వక్రించి మరోలా తలిచింది. దారిలో ఆ కుటుంబం ప్రమాదం బారిన పడింది. కారు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసింది. ఇంటి పెద్దను దూరం చేసింది. మిగిలిన ముగ్గురినీ తీవ్ర గాయాలపాలు చేసింది. కేవలం.. చిన్నపాటి నిర్లక్ష్యం.. ఎదుటివారి అతి వేగమే.. ఈ విషాదానికి కారణమైంది. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో జరిగిన ఈ ఘటన.. అందరినీ కంటతడి పెట్టించింది.
గమ్యం చేరే క్రమంలో...
తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన నారబోయిన సైదులు (34), భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై.. రాజేశ్వరి తల్లి గారి ఇంటికి బయల్దేరారు. గుంటూరు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చేరుకునే క్రమంలో.. మాచర్ల మండలం రాయవరం కూడలివరకూ బాగానే ప్రయాణం పూర్తి చేశారు. అక్కడ.. ఎదురుగా అతి వేగంగా వచ్చిన కారు.. సైదులు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో సైదులు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలంలోనే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు.
ప్రమాదంలో సైదులు భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు