Crime News: కృష్ణా జిల్లా ముసునూరు మండలం లోపూడి తమ్మిలేరులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు. లోపూడి గ్రామానికి చెందిన ఆకుల రాజశేఖర్(19), పాకనాటి రాంబాబు(20) లు.. పశువులను మేతకోసం తమ్మిలేరు పరివాహక ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తాగునీటికోసం పశువులు నీటిలోకి దిగాయి.
ఆ పశువులు ఒడ్డుకు చేరకపోవడంతో యువకులిద్దరు నీటిలోకి దిగారు. దీంతో.. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు. యువకుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
క్రికెట్ ఆడుతుండగా గొడవ..
విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో క్రికెట్ ఆటలో చెలరేగిన గొడవ.. కత్తులు దూసుకునే వరకు వెళ్లింది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా.. ఇరువర్గాల యువకులు గొడవపడ్డారు. ఆ రోజు గ్రామ పెద్దలు నచ్చచెప్పారు. అయితే.. ఇవాళ ఉదయం కాపు కాసిన బెనర్జీ అనే వ్యక్తి.. కత్తితో జోజి అనే యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. బోజి పరిస్థితి విషమంగా ఉండడంతో.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అపార్ట్మెంట్ పై నుంచి కిందపడ్డ వ్యక్తి..
అపార్డ్మెంట్ పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన.. నెల్లూరులో చోటుచేసుకుంది. నగరంలోని గుప్తా పార్క్ సమీపంలో రాజ్ విహార్ రెసిడెన్సీలో నివాసముంటున్న రాజేష్ అనే వ్యక్తి.. ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం అపార్ట్ మెంట్ పైకి వెళ్లిన రాజేష్.. ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. ఆ సమయంలో కరెంట్ తీగలపై పడటంతో.. తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతిచెందారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా తోసేసారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మార్కెట్ సెంటర్లో హత్యాయత్నం..
కృష్ణాజిల్లా ఉయ్యూరు మార్కెట్ సెంటర్లో హత్యాయత్నం కలకలం రేపింది. ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పాత గొడవల నేపథ్యంలో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వ్యక్తి తోట్లవల్లూరు మండలం బుడ్డలంక గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. నిందితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో సరెండరైనట్లు సమాచారం.
ఇదీ చదవండి:
Asha Workers Protest: కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ఆందోళన... అరెస్టు