సోనీ టీవీ జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'ఇండియన్ ఐడల్' (సీజన్ 12)' కార్యక్రమానికి విశాఖ యువతి ఎంపిక కావడమే కాకుండా రెండు గోల్డెన్ మైక్‌లు సాధించి తన ప్రతిభ నిరూపించుకుంది. తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావటంతోపాటు షణ్ముఖప్రియ చిన్ననాటి నుంచే సంగీతంపై అంతులేని అభిమానాన్ని పెంచుకుంది. ఇప్పటికే 11 రియాల్టీ షోల్లో ప్రతిభ చూపి ప్రశంసలందుకుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియన్ ఐడల్‌కు ఎంపికైన మొదటి తెలుగు యువతిగా రికార్డు సృష్టించింది. తన సంగీత ప్రస్థానం ఆమె మాటల్లోనే.
నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం. నా తండ్రి శ్రీనివాస్ వీణ వాయిద్యంలోనూ, తల్లి రత్నమాల పాటలు పాడడంలో నిష్ణాతులు. సంగీతం అంటే ఏమిటో తెలియని రోజుల నుంచే అమ్మానాన్నలతో కచేరీలకు వెళ్లేదాన్ని. దీనివల్ల నాకు తెలియకుండానే సంగీతంపై మమకారం పెరిగింది. ఆ ఆసక్తిని గమనించి నా తల్లిదండ్రులు పాటలు పాడడం నేర్పారు. మొట్టమొదటిసారిగా 2008వ సంవత్సరంలో జీ-తెలుగు సంస్థ నిర్వహించిన ‘'సరిగమప లిటిల్ ఛాంప్స్'’ పోటీలో పాల్గొని టైటిల్ దక్కించుకున్నాను. అప్పుడు నా వయసు ఐదేళ్లు. ఆ తరువాత 2009లో మా టీవీ సూపర్‌సింగర్-4లో రెండో స్థానంలో నిలిచాను. స్టార్ విజయ్ ఛానెల్ వాళ్లు 2010వ సంవత్సరంలో‘తమిళ్ జూనియర్ సూపర్ స్టార్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నేను తమిళంలోనే పాడాల్సి ఉంటుంది. విజేతగా నిలవాలన్న లక్ష్యంతో తమిళ భాషను కూడా కొంత వరకు నేర్చుకున్నాను. నాకప్పుడు ఎనిమిదేళ్లే. తెలుగుపైనే పూర్తి అవగాహన లేని వయస్సు. అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ భాష నేర్చుకున్నాను. ఎంతో పట్టుదలతో చేసిన నా ప్రయత్నాలు ఫలించి విజేతగా నిలిచాను. ఆ ఛానల్ వాళ్లు పాండిచ్చేరిలో డ్లూప్లెక్స్ గృహాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు.
ఆయన ప్రశంసలను మరువలేను
‘ఈటీవీ’ 2013వ సంవత్సరంలో నిర్వహించిన ‘'పాడుతా తీయగా'’లో పాల్గొని రన్నరప్‌గా నిలవడం మరువలేని అనుభూతి. ఆ కార్యక్రమానికి వచ్చిన రామోజీరావు గారు నన్ను అభినందించిన క్షణాలను నేను మరువలేను. హిందీ పాటల్లోనూ మంచి ప్రవేశం ఉంది. ‘జీ- హిందీ’ సంస్థ 2017వ సంవత్సరంలో నిర్వహించిన ‘సరిగమప లిటిల్ ఛాంప్స్’లో రన్నరప్‌గా నిలిచాను. మాటీవీ ఛానెల్ 2015వ సంవత్సరంలో సూపర్‌సింగర్-9లో నిర్వహించినప్పుడు గాయని కల్పన బృందంలో నేను సభ్యురాలిగా ఉన్నాను. మా బృందం విజేతగా నిలిచింది. జెమినీ ‘స్టార్ ఆఫ్ ఏపీ’ పోటీలో పాల్గొన్నాను.
తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలకం