ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పుస్తకాలు చదువుతా.. కుంగ్‌ఫూ నేర్చుకున్నా! - జేసీ కల్పనా కుమారి ముఖాముఖి

‘నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. డైరీలు రాస్తుంటా. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతా. ప్రజలతో కలిసి పనిచేయడానికే ఇష్టపడుతుంటా. బహుశా ఇవే నేను ఐఏఎస్‌ అవ్వడానికి కారణమై ఉంటాయి.’ అని యువ ఐఏఎస్‌ అధికారిణి కల్పనా కుమారి అంటున్నారు. ఇటీవలే గృహనిర్మాణ జేసీగా విశాఖ జిల్లాలో బాధ్యతలు స్వీకరించారామె. రోజూ క్షేత్రస్థాయిలో పరిశీలనలు, అధికారులు, సిబ్బందితో సమీక్షలు చేస్తూ పనులను పట్టాలెక్కించడానికి కృషి చేస్తున్నారు. ‘ఈటీవి భారత్​’తో వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

jc  Kalpana Kumari
జేసీ కల్పనా కుమారి

By

Published : Jul 18, 2021, 11:06 AM IST


తల్లిదండ్రులతో కల్పనా కుమారి..

మా తండ్రి విపిన్‌ కుమార్‌ ఆర్‌బీఐలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అమ్మ గృహిణి. అక్క దిల్లీలోని యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో నేనే చిన్నదాన్ని. నాన్న ఉద్యోగరీత్యా దక్షిణ దిల్లీలోనే ఉండేవాళ్లం. అక్కడే కేంద్రియ పాఠశాలలో ప్లస్‌ టూ వరకు చదువుకున్నాను. అప్పుడే హాకీ ఆడేదాన్ని, ఆడపిల్లకు ఆత్మరక్షణ అవసరమని కుంగ్‌ఫూ కూడా నేర్చుకున్నాను. లింగయాస్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను.. బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగానే సివిల్స్‌కు ప్రయత్నించాను. చదవడం అవ్వడం లేదని ఉద్యోగాన్ని వదిలేసి ఎంఏ ఫిలాసఫీ చేశాను. తరువాత సివిల్స్‌పై గట్టి పట్టుపట్టి నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించగలిగాను. అమ్మా నాన్న ప్రోత్సాహం మరువలేనిది. ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉన్నప్పుడే సివిల్స్‌ లాంటివి సాధ్యపడతాయని నా నమ్మకం. మావారు కూడా ఐఏఎస్‌ అధికారే. పేరు మయూర్‌ అశోక్‌. ప్రస్తుతం విజయనగరం జిల్లా గృహనిర్మాణ జేసీగా చేస్తున్నారు.


తెలుగు కోసం సినిమాలు..

నేను మొదటిగా నెల్లూరు శిక్షణ కలెక్టర్‌గా వచ్చాను. వివిధ విభాగాల్లో ఇన్‌ఛార్జిగా పనిచేశాను. ఆ తర్వాత నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా ఇచ్చారు. తెలుగు మాట్లాడటం నేర్చుకోవాలని సినిమాలు చూసేదాన్ని. మావారు కావలి సబ్‌ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌ చేశారు. ఆయనకి నాకంటే బాగానే తెలుగు మాట్లాడడం, రాయడం వచ్చింది. నేను టీవీల్లో ఇంటర్వ్యూలు చూసి తెలుగు నేర్చుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే బాగా మాట్లాడగలుగుతున్నాను. రాయగలగుతున్నాను.

  • ఆలోచనలు పంచుకుంటాం..

సబ్‌ కలెక్టర్‌గా, గృహనిర్మాణ జేసీలుగా మేమిద్దరం పనిచేయడం వల్ల వృత్తిపరంగా ఏ ఆలోచనలు వచ్చినా పంచుకుంటున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా గృహనిర్మాణ పథకాలపై చర్చించుకుంటాం. పేదలకు పెద్ద సంఖ్యలో ఇళ్లు కట్టడంలో ఎదురైన అనుభవాలను ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల పనిలో కొంత వేగం కనిపిస్తోంది. ఆ జిల్లాలో ఎలా చేస్తున్నారు?, ఇక్కడ ఏవిధంగా చేస్తుందీ మాట్లాడుకుని ఎలా అయితే పని సులువుగా అవుతుంది.. పారదర్శకంగా పథకం అందరికీ చేరడానికి ప్రణాళికలు చేయగలుగుతున్నాం. కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సూచనలతో జిల్లాలో గృహనిర్మాణ ప్రగతికి కృషి చేస్తున్నాను. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలన్నదే నా ఆకాంక్ష.

మాది ప్రేమ పెళ్లి..

ఐఏఎస్‌ శిక్షణలో భాగంగా భారత్‌ దర్శన్‌ కార్యక్రమంలో 45 రోజుల పాటు 12 రాష్ట్రాల్లో పాలనాపరమైన విధానాలను పరిశీలించడానికి తిరిగాం. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. ఆయనకూ పుస్తక పఠనం అలవాటు ఉంది. నేను పాటలు పాడతా.. ఆయన తబలా వాయిస్తుండేవారు. సాంకేతికంగా మయూర్‌కు మంచి పరిజ్ఞానం ఉంది. కోడింగ్‌, రొబోటిక్స్‌ అంటే ఆయనకు ఇష్టం. ప్రజలకు సేవచేయాలనే తపన ఎక్కువ కనిపించేది. అదే మా ఇద్దరిని కలిపింది. ఒకరినొకరు ఇష్టపడ్డాం. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాం.

  • ఐఏఎస్‌లు కాకముందు....

ఐఏఎస్‌లు కాకముందు నేను, మావారు ఇద్దరం బ్యాంకు ఉద్యోగాలు చేసినవాళ్లమే. నేను ఇంజినీరింగ్‌ అయిన తరువాత దిల్లీలోని సిండికేట్‌ బ్యాంకు పీవోగా ఉద్యోగం చేశాను. మయూర్‌ ముంబయి ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి దుబాయ్‌లోని ఓ బ్యాంకుకు సంబంధించిన డాటా అనలటిక్స్‌ విభాగంలో ఉద్యోగం చేశారు. మాకు ముందు పరిచయం లేదు. ఐఏఎస్‌ శిక్షణలో కలిసినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. ఆయన మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించారు.

ఇదీ చదవండీ..దివ్యాంగ పింఛను కోసం ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details