ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ ఉక్కు, అనుబంధ సంస్థల్లో 100 శాతం వాటాలు అమ్మేస్తాం' - విశాఖ ఉక్కు పరిశ్రమ

విశాఖ ఉక్కు, అనుబంధ సంస్థల్లో 100 శాతం వాటాలు అమ్మేస్తామని కేంద్రం ప్రకటించింది. ఉద్యోగులు, ఇతర భాగస్వాముల సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక విక్రయ విధివిధానాల ఖరారు సమయంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కర్మాగారంలో రాష్ట్రానికి ఎలాంటి వాటా లేదని... లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ విషయంలో అవసరమైనప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

vizag steel plant
విశాఖ ఉక్కు పరిశ్రమ

By

Published : Mar 9, 2021, 4:44 AM IST

Updated : Mar 9, 2021, 6:43 AM IST

'విశాఖ ఉక్కు, అనుబంధ సంస్థల్లో 100 శాతం వాటాలు అమ్మేస్తాం'

విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు అనుబంధ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ - ఆర్ఐఎన్ఎల్​కు ఉన్న వాటాలను 100 శాతం విక్రయిస్తామని కేంద్రం ప్రకటించింది. జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ - సీసీఈఏ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మల సమాధానమిచ్చారు.

మూలధనం సమకూర్చుకునేందుకు..

కేంద్ర ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవడం వల్ల ఆ సంస్థను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త సాంకేతికత, అత్యుత్తమ యాజమాన్య విధానాలు తీసుకురావడానికి అవసరమైన మూలధనం సమకూర్చుకునేందుకు వీలవుతుందని మంత్రి వివరించారు. దీని వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడం సహా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర భాగస్వాముల న్యాయబద్ధమైన సమస్యలను తగిన విధంగా పరిష్కరించడానికి ప్లాంటు వ్యూహాత్మక విక్రయ విధివిధానాల ఖరారు సమయంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వాటాల కొనుగోలు ఒప్పందంలో అందుకు తగ్గట్లుగా నిబంధనలను పొందుపరుస్తామని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటాలూ లేవని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక అంశాల్లో అవసరమైనప్పుడు రాష్ట్రాన్ని సంప్రదిస్తున్నామని నిర్మలాసీతారామ‌న్ చెప్పారు. జోక్యం కావాల్సి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు కోరతామన్నారు.

కర్మాగారం ఆస్తుల స్థూల విలువ..
విశాఖ ఉక్కు కర్మాగారం ఆస్తుల స్థూల విలువ 32 వేల 22 కోట్ల 32 లక్షలుగా ఉందని.. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. లోక్‌సభలో తెలుగుదేశం, వైకాపా ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వల్లభనేని బాలశౌరి, మార్గాని భరత్‌ సంయుక్తంగా అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2020 డిసెంబర్‌ 31 నాటికి సంస్థ భూములు, ప్లాంట్‌, పరికరాలు, చరాస్తుల స్థూల విలువ రూ. 32 వేల 22 కోట్ల 32 లక్షలుగా లెక్కగట్టినట్లు చెప్పారు. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వం మూలధన వాటా కింద గత డిసెంబర్‌ నాటికి రూ. 4 వేల 889 కోట్ల 85 లక్షల పెట్టుబడి పెట్టిందన్నారు. గత అయిదేళ్లలో నాలుగేళ్లపాటు సంస్థకు నష్టాలు వచ్చాయని వెల్లడించారు.

గత ఐదేళ్లుగా నష్టాల్లో...

దేశంలోని 30 ప్రభుత్వ రంగ సంస్థలు గత ఐదేళ్లుగా నిరంతరం నష్టాల్లో నడుస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2019-20 నాటికి ఈ 30 సంస్థల నష్టం రూ. 30 వేల 131 కోట్లకు చేరిందన్నారు.

సూత్రప్రాయంగా ఆమోదముద్ర

2016లో కేంద్రం 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిందని... ఇప్పటి వరకూ 8 సంస్థల్లో ఆ పని పూర్తయిందని తెలిపారు. ఫలితంగా రూ. 66 వేల 712 కోట్ల ఆదాయం వచ్చినట్లు స్పష్టం చేశారు. 2021-22లో మిగతా వాటిలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. లక్షా 75 వేల కోట్లు ఆర్జించాలని బడ్జెట్‌ అంచనాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. గతేడాది మార్చి 31 నాటికి నష్టాల్లో నడుస్తున్న సంస్థల్లో 50 వేల 291 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల రాస్తారోకో

Last Updated : Mar 9, 2021, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details