విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమపై ఆధారపడి లక్ష కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు అన్నీ అమ్మేస్తారా? అని నిలదీశారు. పోస్కోతో విజయసాయిరెడ్డి ఏం చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
"పోస్కో సంస్థతో మూడుసార్లు వైకాపా నేతలకు విందు భేటీలు జరిగాయి. ఆ సమావేశాల్లో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమకు ఎక్కడ స్థలాలున్నాయో తెలుసుకున్నారు. సీతమ్మధారలోని 21 ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నారు. పోస్కోతో మీకది - మాకిది ఒప్పందం చేసుకున్నారు. విశాఖ ఉక్కుపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పోస్కో వచ్చింది" - దేవినేని ఉమ, మాజీ మంత్రి