ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా రోగికి సౌలభ్యం కోసం వైద్యుల నూతన ఆవిష్కరణ

కరోనా రోగిని ఇంట్లోనే ఉంచి పర్యవేక్షించడానికి, తగిన చికిత్సలను సూచించడానికి ‘రిమోట్‌ హెల్త్‌ మోనిటరింగ్‌ సిస్టం’ను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ వైద్యులు, బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.

new invention of physicians for convenience of corona patient
new invention of physicians for convenience of corona patient

By

Published : Apr 15, 2020, 8:47 AM IST

కరోనా రోగిని ఇంట్లోనే ఉంచి పర్యవేక్షించడానికి, తగిన చికిత్సలను సూచించడానికి ‘రిమోట్‌ హెల్త్‌ మోనిటరింగ్‌ సిస్టం’ను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ వైద్యులు, బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. కరోనా అనుమానితుల, బాధితుల శరీర ఉష్ణోగ్రత, పల్స్‌రేటు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి, శ్వాస తీసుకునే వేగాన్ని ఆసుపత్రుల నుంచే వైద్యులు గమనిస్తూ అవసరమైన చికిత్సలను అందిస్తారు. దేశవ్యాప్తంగా వేలాది మంది కరోనా బారిన పడుతుండటం, ఆసుపత్రుల్లో వైద్యం చేయడానికి వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది నానా అవస్థలు పడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయాలను ఆలోచించి ఎయిమ్స్‌ వైద్యులు, బెల్‌ శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని రూపొందించారు.

సెన్సర్లు అతికిస్తే చాలు....

కొవిడ్‌ అనుమానితుల శరీర ఉష్ణోగ్రత, పల్స్‌రేట్‌, ఇతర ప్రామాణికాలను తెలుసుకునేందుకు అవసరమైన సెన్సర్లను, ఆ సెన్సర్లలోని సమాచారాన్ని సుదూరంగా ఉండే వైద్యులకు అందించే యాప్‌ను బెల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఒక సెన్సర్‌ను గుండెపైనా, మరో సెన్సర్‌ను చేతి మణికట్టు వద్ద అతికిస్తే చాలు రోగి ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది వైద్యులు తమ సెల్‌ఫోన్‌ యాప్‌లోనూ, కంప్యూటర్‌ తెరపైనా చూసుకోవచ్చు. రోగి, అనుమానితుడు మొదటిసారి వచ్చినప్పుడే ఆయనకు అవసరాన్ని బట్టి కిట్‌ ఇచ్చేస్తారు. ఔషధాలు ఎలా ఇవ్వాలన్న విషయాన్ని కుటుంబసభ్యులకు చెబుతారు. ఫలితంగా రోగి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే వైద్యం అందుతుంది. కుటుంబసభ్యులు కూడా రోగి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

మరికొన్ని ప్రత్యేకతలు...

* దీనికి అధునాతన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), క్లౌడ్‌ పరిజ్ఞానాలను ఉపయోగించారు.

* ఎన్ని లక్షల మందికి సంబంధించిన సమాచారాన్నైనా ఆయా సెన్సర్ల ద్వారా ఒకేసారి తెప్పించుకోవచ్చు.

* బాధితులకు వేగవంతమైన వైద్యాన్ని సకాలంలో అందించడానికి అవకాశం ఉంటుంది.

* యాప్‌లు, కంప్యూటర్ల నుంచి రోగులకు సంబంధించిన సమాచారం స్థానిక సంస్థలకు కూడా చేరుతుంది.

* ఆసుపత్రుల్లో ఉంటున్నామన్న మనోవ్యథకు రోగులు దూరమవుతారు.

* తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబసభ్యులు చేపట్టే వ్యక్తిగత పర్యవేక్షణ వల్ల రోగులు వేగంగా కోలుకోవచ్చు.

* రోగి వద్దకు వెళ్లి పరీక్షించాల్సిన అవసరం లేకపోవడంతో వైద్యులు, నర్సులు, ఇతరులు కొవిడ్‌ బారిన పడే ముప్పు తప్పుతుంది. పీపీఈల అవసరం కూడా ఉండదు.

ఆసుపత్రులపై భారం తగ్గుతుంది

బెల్‌ శాస్త్రవేత్తల సహకారంతో మేము అభివృద్ధి చేసిన అధునాతన పరిజ్ఞానంతో ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. ఆసుపత్రుల్లో రోగుల నుంచి ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు తగ్గుతాయి. అత్యవసర కేసులపై ఎక్కువ దృష్టి సారించడానికి వైద్యులకు వెసులుబాటు కలుగుతుంది. మా ఉత్పత్తికి ‘క్లినికల్‌ వ్యాలిడేషన్‌’ లభించాల్సి ఉంది. - డాక్టర్‌ మోహిత్‌, ఎండీ, రేడియాలజీ విభాగం, ఎయిమ్స్‌, రిషికేశ్‌, ఉత్తరాఖండ్‌

ఇదీ చదవండి :

నేటి నుంచి 1184 వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ABOUT THE AUTHOR

...view details