రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయపరంగా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు అన్ని జిల్లాలకు చెందిన కాపు నేతలు ఆదివారం విశాఖలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, విశ్రాంత డీజీపీ సాంబశివరావు, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహనరావుతోపాటు అన్ని పార్టీల్లోని కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులు, మేధావి వర్గానికి చెందిన మరికొందరు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాపు వర్గానికి జరుగుతున్న అన్యాయం, కాపు కార్పొరేషన్‌కు నిధులు లేకపోవడం వంటి అంశాలపై చర్చించారు.
మిగిలిన బీసీ, ఎస్సీ వర్గాలతో కలిసి ‘ఫోరం ఫర్ బెటర్ ఏపీ’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి పోరాడాలని నిర్ణయించారు. ఈ సంస్థకు కమిటీని నియమించి రాష్ట్రంలోని కాపు నాయకులను ఒక తాటిపైకి తెచ్చి వారి ద్వారా మిగిలిన సామాజికవర్గాలను కలుపుకొని ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే అంశం చర్చకు వచ్చింది. భవిష్యత్తులో రాజకీయ ఎజెండా తీసుకునే అవకాశం ఉందని విశ్రాంత డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా కాపులు ఎదగడానికి రాజకీయ ప్రత్యామ్నాయంగా ఇతర వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు.