దేశంలో సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్న వారి సంఖ్య సుమారు 30 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్... ఈ యాప్‌లదే. నేటి సామాజిక యుగమంతా. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రికెట్ స్టార్లు ఇలా చెప్పుకొంటూ పోతే సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవారికి ఫాలోవర్ల సంఖ్య సైతం అందుకు అనుగుణంగానే పెరుగుతోంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వస్తోంది. సున్నితమైన అంశాలపై పోస్టులు, ట్రోల్స్‌తో సమాజంలో కొందరు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా చేయడం పోలీసులకు సవాలుగా మారింది. ఇలాంటి ఆగడాలకు ఏపీ సీఐడీ చర్యలు తీసుకోనుంది.
విశాఖలో సీఐడీ అధికారులు సైబర్ నేరాల నియంత్రణపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పోస్టులు, ట్రోల్స్‌పై కన్నేసి ఉంచేందుకు ఆయా సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టులతో కలిగే దుష్పరిణామాలను ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, గూగుల్ ప్రతినిధులకు అధికారులు వివరించారు. వాటి వల్ల జరిగే అనర్థాలు, శాంతి భద్రతల సమస్యలను వివరించి... కీలక సమయాల్లో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించనున్నట్లు.... సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ - కామర్స్ కంపెనీలతోనూ చర్చించి సైబర్ మోసాలను అదుపు చేస్తామని చెప్పారు.