రైల్వే ఉద్యోగాలన్నారు... చివరకు అరెస్టయ్యారు! - రైల్వే పోలీసులు
రైల్వే ఉద్యోగమంటే ఆశ పడనిదెవరు? అదే ఆసరాగా చేసుకుందో ముఠా. మేం ఉద్యోగం ఇప్పిస్తాం.. మాకు డబ్బివ్వండి! అంటూ నమ్మించారు. చివరకు పోలీసుల చేతికి చిక్కారు.
విశాఖలో ఓ ముఠా.. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. రైల్వే ఉద్యోగాలంటూ అమాయకులకు ఆశ చూపింది. 10 మందికి ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు నిందితులు. ఈ విషయం ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలిసింది. వారు వేసిన నిఘాలో.. ముఠా చిక్కుకుంది. విశాఖకు చెందిన రాజశేఖర్ రావు, శ్రీనివాస్, పేడాడ అనంతరావును రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ నియామక పత్రాలు, రూ.లక్ష డిపాజిట్ రసీదులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం విచారణ కోసం రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ముఠా గుట్టురట్టు చేసిన ఆర్పీఎఫ్ ప్రత్యేక బృందానికి అధికారులు 10వేల రివార్డు అందజేశారు.