విశాఖ ఉక్కు భూమిలో పోస్కో ప్లాంట్ - విశాఖలో పోస్కో స్టీల్ ప్లాంట్
18:36 February 10
కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
విశాఖ ఉక్కు కర్మాగారం భూమిలో కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పోస్కో సంస్థ ఆసక్తి చూపినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. ‘పోస్కో, హ్యుందాయ్ సంస్థలు రూ.30 వేల కోట్ల పెట్టుబడితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాయా’ అని బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారం భూభాగంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆర్‌ఐఎన్‌ఎల్, పోస్కో సంస్థల మధ్య 2019 అక్టోబర్‌లో కట్టుబాటు లేని (నాన్-బైండింగ్) అవగాహన ఒప్పందం కుదిరింది. దాన్ని అనుసరించి సమాచార మార్పిడి కోసం సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటైంది.
కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలో రెండు సంస్థల వాటా ఏ మేరకు ఉండాలన్నదానిపై ఇంకా నిర్ధారించలేదు. అయితే ఎంవోయూ ప్రకారం పోస్కో సంస్థ కొత్త ప్లాంట్‌లో కనీసం 50% వాటా కావాలని కోరింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఎంత వాటా ఇవ్వాలన్నది గ్రీన్‌ఫీల్డ్ కర్మాగారానికి అది సమకూర్చే భూమి విలువను బట్టి లెక్కిస్తారు. ఈ అంశంపై భారత్‌లో దక్షిణ కొరియా రాయబారితో కలిసి పోస్కో, హ్యుందాయ్ సంస్థలకు చెందిన ఉమ్మడి బృందం ఆర్‌ఐఎన్‌ఎల్‌ను సందర్శించి, ఆ సంస్థతోపాటు, ఎన్‌ఎండీసీ, కేంద్ర ఉక్కుశాఖ అధికారులతో 2018 అక్టోబర్ 22న జరిగిన సమావేశంలో పాలుపంచుకొంది. ఆ తర్వాత పోస్కో అధికారులు విశాఖ స్టీల్ భూమిలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసే అంశంపై 2019 జులై 9, 2019 సెప్టెంబర్ 23, 2020 ఫిబ్రవరి 20వ తేదీల్లో ఆర్‌ఐఎన్‌ఎల్‌ను సందర్శించారు’ అని కేంద్ర మంత్రి వివరించారు.
ఇదీ చదవండి:'విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధం'