సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం జైతవరం నుంచి బైలపూడి వరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొన్నిచోట్ల మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజా సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. బైలపూడి గ్రామం వైకాపాకు కంచుకోటని.. ఇప్పటివరకు గ్రామానికి మూడున్నర కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు.
అనంతపురం జిల్లాలో..
ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ అన్నారు. నంబులపూలకుంట మండలంలోని ధనియాని చెరువు నుంచి ఎన్పి కుంట వరకు వైకాపా శ్రేణులు పాదయాత్ర చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ..
జిల్లాలోని ఉండి నియోజకవర్గ ఇంఛార్జీ పీవీఎల్ నర్సింహరాజు ఆధ్వర్యంలో పాలకోడేరు మండలంలోని గ్రామాల్లో... 'ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు' పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.