రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన అమలు చేయకపోతే... రాజ్యాంగంలోని ఆర్టికల్ 355, 356ను అనుసరించి గవర్నర్ పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు అన్నారు. చంద్రబాబు పాలనలో పాలనపరమైన వైఫల్యాల కారణంగా రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందాన మారిందన్నారు. అందుకే తాను రాసిన పుస్తకానికి ఆ పేరు పెట్టినట్లు చెప్పారు.
రాజధాని అమరావతిలో పరిస్థితులు, మూడు రాజధానుల వల్ల ముప్పును వివరిస్తూ వడ్డే రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వెంకట గోపాల గౌడ అన్నారు. ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానాల్లో ఉన్నందున తాను ఎక్కువగా స్పందించలేనని చెప్పారు. ప్రజా ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనం కన్నా ప్రజల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలు కూడా చట్ట విరుద్ధంగా పాలన సాగించే ప్రభుత్వాలను నిలదీయాలని... ప్రశ్నించే తత్త్వాన్ని పెంచుకోవాలని సూచించారు.
ప్రభుత్వం న్యాయస్థానాలపై కూడా దాడి చేసేలా కుట్రలు చేస్తోందని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. ఏ వ్యవస్థకు ఉండే అధికారం... ఆ వ్యవస్థలకు ఇస్తూ రాజ్యాంగం రూపొందించారని.. అధికార బలం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తే.. న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోబోదన్నారు.