ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్లమెంటులో పోరాటం.. తెదేపా నిర్ణయం - పార్టీ నేతలో చంద్రబాబు మీటింగ్ న్యుస్

రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. రాజధానిని మారుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని వైకాపా..ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ పేరిట 3 రాజధానుల నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. శాంతియుత ఆందోళన చేస్తున్న అమరావతి రైతులపై నక్సలైట్లు, తీవ్రవాదులపై పెట్టే కేసులను పెడుతూ..వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆక్షేపించారు. సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శాసన మండలి రద్దు , జాతీయ ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపైనా గళం వినిపిస్తామన్నారు.

tdp-parlimentary-party-meeting
tdp-parlimentary-tdp-parlimentary-party-meetingparty-meeting

By

Published : Jan 29, 2020, 5:47 AM IST

పార్లమెంటులో పోరాటం.. తెదేపా నిర్ణయం

ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమవేశాలు ప్రారంభమవుతున్నందున...తెలుగుదేశం పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఇతర నాయకులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన 9 ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. రాజధాని అమరావతి మార్పు, 3 రాజధానుల ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వ విధ్వంసకర చర్యలపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఉపాధిహామీ నిధుల మంజూరు, నిలిచిపోయిన పోలవరం పనులతో పాటు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కండిషనబుల్ బెయిల్ షరతులను ఉల్లంఘించి చేస్తున్న ప్రలోభాలు, రాస్తున్న లేఖలు, మీడియాపై ఆంక్షలు, అక్రమ కేసులపై సమావేశంలో చర్చించారు. తెలుగుదేశం హయాంలో దేశంలో తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం... వైకాపా పాలనలో అట్టడుగుకు దిగజారిందనే వాస్తవాన్ని ఇటీవల కొన్ని సర్వేలు బయటపెట్టాయని చంద్రబాబు అన్నారు.
దేశ మ్యాప్‌లో అమరావతి లేకపోవడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లీ...మళ్లీ పెట్టించారంటూ ఎంపీలను అభినందించారు. అదే స్ఫూర్తిని ఇప్పుడు మళ్లీ చూపాలని..రాజధాని అమరావతి పరిరక్షణకు రైతులు, ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని కేంద్రానికి వివరించాలన్నారు. మహిళలపై లాఠీ చార్జ్‌, రైతులపై అక్రమ కేసులు, మహిళలను రాత్రిపూట స్టేషన్లలో నిర్బంధించడం, అన్నదాతల మరణాలపై పుస్తక రూపంలో.. కేంద్ర ప్రభుత్వ ముఖ్యులకు, జాతీయ పార్టీల నాయకులకు, రాజ్యాంగ వ్యవస్థల బాధ్యులకు అందజేయాలని చెప్పారు. ఎంపీ గల్లా జయదేవ్​పై పోలీసుల దాష్టీకాన్ని లోక్‌సభ స్పీకర్​కు ఫిర్యాదు చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంపైనా నేతలు చర్చించారు.

శాసన మండలి రద్దు తీర్మానాన్ని జాతీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీలు స్పష్టం చేశారు. జాతీయ అంశాలైన ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​పైనా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు.

ఇదీ చదవండి: 'రాష్ట్ర వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం'

ABOUT THE AUTHOR

...view details