TDP LEADERS PROTEST: పల్నాడు జిల్లాలో యూట్యూబ్ నిర్వాహకుడు వెంకటేశ్ అరెస్టుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. గుంటూరులో తెలుగుదేశం శ్రేణులు సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
చంద్రబాబు ఆగ్రహం: అసమర్థ పాలనపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అరెస్టు చేయడం ఏంటని.. చంద్రబాబు ప్రశ్నించారు. అర్ధరాత్రి గోడలు దూకి మనుషులను ఎత్తుకెళ్లడం ఏంటని నిలదీశారు. దోపిడీ దొంగల సంస్కృతిలోకి పోలీసులు వెళ్లడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదని.. అరెస్టు సమయంలో పోలీసులు లైట్లు పగులగొట్టి చీకట్లో చేసిన విధ్వంసమే నిజమైన నేరమని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ పెద్దల మన్నన కోసం బరితెగిస్తున్న పోలీసు అధికారులు తప్పక మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వెంకటేశ్, సాంబశివరావులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.