ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సలాం ఆత్మహత్య కేసులో.. అది జగన్నాటకమే: తెదేపా

By

Published : Nov 10, 2020, 5:49 PM IST

సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని తెలుగుదేశం డిమాండ్‌ చేసింది. మైనార్టీలతో కలసి అనేక జిల్లాల్లో ఆందోళనలకు దిగిన ఆ పార్టీ నాయకులు... నిందితులను కాపాడే ప్రయత్నాలు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత హోం మంత్రి స్పందించడమేంటని ప్రశ్నించారు.

సలాం ఆత్మహత్య కేసులో.. అది జగన్నాటకమే: తెదేపా
సలాం ఆత్మహత్య కేసులో.. అది జగన్నాటకమే: తెదేపా

ఇటీవలి కాలం వరకు ఎస్సీలు... ఇప్పుడు మైనార్టీలను వైకాపా నాయకులు వేధిస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. నిందితులపై నామమాత్రపు సెక్షన్లు పెట్టి... ప్రజా సంఘాల వ్యతిరేకత చూశాక బెయిల్ రద్దుకు అప్పీల్ చేయడం జగన్నాటకమేనని ఆరోపించారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, డీజీపీ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

స‌లాం కుటుంబాన్ని వెంటాడి, హింసించి సామూహిక ఆత్మహ‌త్యల‌కు పాల్పడేలా చేసి ఇప్పుడు పరిహారం ప్రకటించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నిందితులను కాపాడే ప్రయత్నాలు ఆపి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌ను మండ‌లిలోనే దారుణంగా అవ‌మానించారని గుర్తుచేశారు. రాజ‌మ‌హేంద్రవ‌రంలో సత్తార్ అనే వ్యక్తి ఎస్పీ కార్యాల‌యం ముందే ఆత్మహత్యాయత్నం చేశారన్నారు.

విజయవాడ ధర్నా చౌక్‌లో తెలుగుదేశం నేతలు, మైనారిటీ నాయకులు ధర్నాకు దిగారు. అమరావతి ఉద్యమకారులను జైల్లో పెట్టి వేధిస్తున్న ప్రభుత్వం... అబ్దుల్ సలాం కేసులో మాత్రం గంటల్లో నిందితులు బయటికి వచ్చేలా వ్యవహరించిందని ఆరోపించారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గేది లేదన్నారు. జగ్గయ్యపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మైనారిటీలతో కలిసి తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని వారు డిమాండ్‌ చేశారు.

సలాం కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన వైకాపా నాయకులను ప్రభుత్వం కాపాడుతోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు ఆరోపించారు. సంఘటన జరిగిన 4 రోజుల తరువాత హోం మంత్రి స్పందించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో మైనార్టీలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. సలాం కుటుంబం ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని కృష్ణా జిల్లా తెదేపా నేతలు ఆరోపించారు. ప్రభుత్వం మద్దతుతోనే పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

సలాం కుటుంబం బలవన్మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లా కదిరిలో తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి 42పై బైఠాయించిన వారు... ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం న్యాయ పోరాట కమిటీ నాయకులు ధర్నా చేశారు. ఆందోళనలో పాల్గొన్న తెలుగుదేశం, వామపక్షాలు, ముస్లిం ప్రజా సంఘాలు నిందితులకు బెయిల్ రావడంపై మండిపడ్డాయి.

ఇదీ చదవండి:బిహార్​లో లెక్కింపు ఆలస్యం- తుది ఫలితంపై ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details