తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి అమానుషమంటూ..విజయవాడలోని జిల్లా తెదేపా కార్యాలయం వద్ద కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నల్లజెండాలతో నేతలు నిరసన తెలిపారు. మంత్రి పదవి కోసమే జోగి రమేశ్....నిన్న చంద్రబాబు ఇంటి వద్ద హడావిడి చేశారని కొల్లు మండిపడ్డారు. చంద్రబాబు ఒకమాట చెప్తే వైకాపా నేతలు రోడ్ల మీద తిరగలేరని హెచ్చరించారు. వైకాపా నేతలను ఏపీ నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
జగన్‌కు పాలన కిమ్‌ను తలపిస్తోంది
రాష్ట్రంలో జగన్ పాలన కిమ్ పాలనను తలపిస్తోందని మాజీమంత్రి పీతల సుజాత మండిపడ్డారు. చంద్రబాబుని ఏం చేయాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
'తాలిబన్లకు వారికి తేడా లేదు'
చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి, తెదేపా నేతలపై అక్రమ కేసుల నమోదుకు..ఐపీఎస్ అధికారులు రాత్రంతా డీజీపీ కార్యాలయంలో సమావేశం కావటం సిగ్గుచేటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ధ్వజమెత్తారు. జగన్ మెప్పు పొంది మంత్రి పదవి తెచ్చుకునేందుకే..జోగి రమేశ్ తప్పతాగి చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చాడని విమర్శించారు. పోలీసులే జోగి రమేశ్ కు భద్రత ఇచ్చి దాడికి అవకాశం కల్పించటాన్ని సభ్య సమాజం అసహ్యించుకుంటోందన్నారు. తాలిబన్లకు, వైకాపా రౌడీలకు తేడా లేదన్న బొండా..,తమ సహనం నశిస్తే ఎవరినీ వదలమని హెచ్చరించారు.
అల్లరిమూకతో దండయాత్ర
జోగి రమేశ్ చంద్రబాబుకు విజ్ఞాపన ఇచ్చేందుకే వస్తే..,అల్లరిమూకతో దండయాత్రగా ఎందుకు రావాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని మాజీమంత్రి జవహర్ నిలదీశారు. చంద్రబాబుని తిడితే తప్ప మంత్రివర్గంలో చోటు లభించదనే దురుద్దేశం జోగిరమేశ్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తన అధికారం కోసం మాట్లాడుతున్న జోగి రమేశ్...బీసీ ఉప ప్రణాళిక, ఆదరణ పనిముట్లపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు.