ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PATTABHI: బ్రేకుల్లేని బుల్డోజర్​లా.. లోకేశ్ వారిని తొక్కేస్తారు: పట్టాభి

PATTABHI: రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. వైకాపా అక్రమాలు ఇంకా ఎంతో కాలం సాగవని హెచ్చరించారు. తప్పు చేసిన జగన్​తో సహా ఇతర వైకాపా నేతలను.. బ్రేకుల్లేని బుల్డోజర్​లా నారా లోకేశ్ తొక్కేస్తారని అన్నారు.

పట్టాభి
పట్టాభి

By

Published : Jun 19, 2022, 3:38 PM IST

Updated : Jun 20, 2022, 8:56 AM IST

PATTABHI: ‘జగన్‌రెడ్డిది చీకటి బతుకు. అందుకే అర్ధరాత్రి అయ్యన్న ఇంటిపైకి జేసీబీలను పంపారు’ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. ‘జలవనరులశాఖ స్థలాన్ని ఆక్రమించుకుని ప్రహరీ కట్టారని చెబుతున్న వాళ్లకు.. 2019లో అదే శాఖ నిరభ్యంతర పత్రం ఇచ్చిందని తెలియదా? నిజంగా ఆక్రమిస్తే నోటీసు ఇచ్చి వివరణ కోరకుండా అర్ధరాత్రి నోటీసు అంటించి ఎందుకు కూల్చారు?’ అని విలేకరుల సమావేశంలో ఆయన ప్రశ్నించారు. ‘ఆక్రమణకు గురైన స్థలం 2 సెంట్లని నోటీసులో ఉంది. దీనికోసం జేసీబీలు, వందలమంది పోలీసులు, అధికారుల్ని జగన్‌రెడ్డి పంపారు. అయ్యన్నపాత్రుడి సతీమణి నర్సీపట్నంలో కౌన్సిలర్‌. ఇంట్లో మహిళ ఉందనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా అర్ధరాత్రి జేసీబీలతో ప్రహరీని కూల్చేశారు’ అని మండిపడ్డారు. ‘అయ్యన్న తాత లచ్చాపాత్రుడు 1957లో ఎమ్మెల్యే. నర్సీపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు 22 ఎకరాలను దానం చేసిన చరిత్ర ఆ కుటుంబానిది. నర్సీపట్నం సమీపంలో అయ్యన్నపాలెం అనే ఊరే ఆ కుటుంబం పేరుతో ఉంది. ఆ ఊరికి భూములిచ్చిందీ అయ్యన్న కుటుంబమే’ అని పట్టాభిరాం వివరించారు.

సీఎంవి చీకటి పనులు

‘జగన్‌రెడ్డి కుటుంబానికి పైసా దానం చేసిన చరిత్ర లేదు. ఇడుపులపాయ ఎస్టేట్‌లో ఎసైన్డ్‌ భూములు కబ్జా చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ ఇంటిపక్కన చెరువును ఆక్రమించి, కేసీఆర్‌ ద్వారా క్రమబద్ధీకరించుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఎస్సీ మహిళా ఉపాధ్యాయురాలి ఇంటికెళ్లే దారికి అడ్డంగా వైకాపా నాయకుడు గోడ కట్టారు. ఆమె వీల్‌ఛైర్‌లో తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చినా న్యాయం చేయలేని జగన్‌రెడ్డికి సీఎం స్థానంలో ఉండే అర్హత లేదు’ అని దుయ్యబట్టారు.

వైకాపా అక్రమాలు ఇంకా ఎంతో కాలం సాగవని.., బ్రేకుల్లేని బుల్డోజర్​లా తప్పు చేసిన జగన్​తో సహా వైకాపా నేతలను నారా లోకేశ్ తొక్కేస్తారని హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత.. ముమ్మాటికీ కక్ష సాధింపేనని అన్నారు.

ఏం జరిగిందంటే? : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆర్డీవో మణికంఠ అయ్యన్న ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించారు.

ఇవీ చూడండి :

Last Updated : Jun 20, 2022, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details