ఫైబర్‌నెట్‌పై బురదజల్లాలనే ప్రభుత్వ కుట్రలో భాగంగానే.. గౌరీశంకర్‌ను ఎండీగా నియమిస్తూ సంబంధిత నోట్‌ఫైల్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సంతకం చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ వెల్లడించారు. ఈ ఎపిసోడ్‌లో ప్రధాన కుట్రదారు ముఖ్యమంత్రే అని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీఐడీ చీఫ్ సునీల్‌కు దమ్ము, ధైర్యం ఉంటే గౌరీశంకర్ నకిలీ సర్టిఫికెట్లపై విచారణ చేయాలి. ఆయన నియామకానికి కారణమైన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విచారణకు పిలవాలి. దస్త్రంపై ఎందుకు సంతకం పెట్టారని అడగాలి...’ అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ నియామకానికి సంబంధించిన నోట్‌ఫైల్‌ను విడుదల చేశారు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవినీతి రుజువైందని, నాటి ఎండీ సాంబశివరావును అరెస్టు చేశామంటున్న సీఐడీ అధికారులు.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పట్టాభి పేర్కొన్నారు.
*ఫైబర్‌నెట్ ఈడీ బిజినెస్ ఆపరేషన్ పోస్టుకు 2019 అక్టోబరు 28న ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు ఆహ్వానించారు. 12 మంది దరఖాస్తు చేసుకోగా అందులో దుర్గారావు కొప్పిశెట్టి (ఎంబీఏ), కేవీ రాజారావు (ఎంబీఏ) తదితర ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అయినా వారందరినీ పక్కన పెట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. బీఎస్సీ అర్హత ఉన్న గౌరీశంకర్‌ను ఏరికోరి ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన దస్త్రాన్ని 2020 ఫిబ్రవరి 11న సీఎం ఆమోదించి సంతకం చేసిన మాట వాస్తవం కాదా? దీనికి జగన్‌మోహన్‌రెడ్డి ఏమని సమాధానం చెబుతారు? ఇది కుట్ర కాదంటారా అని సీఐడీ చీఫ్‌నూ అడుగుతున్నాం.
*ఎంత మాత్రం అర్హత లేని గౌరీశంకర్‌కు ఎండీ పదవి కట్టబెట్టారు. తమ కంపెనీ అయిన సిగ్నమ్ నుంచి టెరాసాప్ట్‌కు ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ నిజం కాదని, తనపై ఒత్తిడి తెచ్చి ఇప్పించారని ఆయనతో మాయమాటలు చెప్పించారు. తమకు కావాల్సిన విధంగా స్టేట్‌మెంట్ ఇప్పించుకున్నారు. ఇదే విషయాన్ని మంత్రుల కేబినెట్ కమిటీ నివేదికలోనూ పొందుపర్చారు. దానిపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్, గౌతమ్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు సంతకాలు చేశారు. గౌరీశంకర్‌ను ఫైబర్‌నెట్ ఎండీగా నియమిస్తూ 2020 మార్చి 13న జీవో విడుదల చేశాక.. ఆ తర్వాత జూన్ 12న కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చింది.
*గౌరీశంకర్ 2007 ఏప్రిల్‌లో 46% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులైనట్లు దరఖాస్తులో రాశారు. ధ్రువపత్రాల్లో మాత్రం 2009లో ఇంటర్ ఉత్తీర్ణులైనట్లు ఉంది. సీఎం జగన్‌కు ఉన్న శ్రద్ధ కారణంగానే వీటిని అధికారులు పరిశీలించలేదు. రజత్‌భార్గవ, సుమిత్‌కుమార్, ఎం.వెంకటేశ్వరరావు వంటి సీనియర్ అధికారులు సంబంధిత దస్త్రంపై సంతకాలు చేశారు. అర్హత లేని వ్యక్తిని నియమించారంటూ ఆరోపణలు రావడంతో దిక్కుతోచక తొలగించారు. ఆ తర్వాత గౌరీశంకర్ నకిలీ ధ్రువపత్రాలపై ఎందుకు విచారణ చేయలేదు? ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? మీకు కావాల్సిన వ్యక్తి కాబట్టే వదిలేశారా?
*24 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ లైన్ వేయాలంటే రూ.4 వేల కోట్ల మేర ఖర్చు అవుతుంది. దీన్ని రూ.330 కోట్లకు తెదేపా ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూ.149కే అంతర్జాలం, ఫోన్, టీవీ వంటి సౌకర్యాల్ని అందించింది. ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ కూడా అభినందించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో చేపట్టాలని చెప్పారు. నాటి టెలికాం కార్యదర్శి జేఎస్ దీపక్ రాష్ట్రాన్ని సందర్శించి.. మంచి నమూనాగా ప్రశంసించారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టును కుట్రపన్ని నాశనం చేశారు...’ అని పట్టాభి పేర్కొన్నారు. ‘తాడేపల్లి ప్యాలెస్ కుట్రను ఆధారాలతో బహిర్గతం చేశాం. సమగ్ర విచారణ జరగకపోతే సీఐడీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏ స్థాయికైనా తీసుకెళ్తాం. కుట్రలో భాగస్వాములందరినీ బయటకు తెచ్చి శిక్షించాలి...’ అని పట్టాభి డిమాండు చేశారు.
ఇదీ చదవండి:
VARLA RAMAIAH: అధికార పార్టీ కించపరిస్తే స్పందించలేదే..?: వర్ల రామయ్య