హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. జస్టిస్ ఈశ్వరయ్య.. జిల్లా మేజిస్ట్రేట్‌తో ఫోన్లో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు సీజేలపై వివాదాస్పదంగా మాట్లాడరన్న అంశంపై రాష్ట్ర హైకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది. ఫోన్ సంభాషణలో కుట్ర కోణం ఉందో.. లేదో తేల్చాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్‌ను నియమించింది. న్యాయవిచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది.
జస్టిస్ ఈశ్వరయ్య తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ప్రైవేటు సంభాషణపై విచారణకు హైకోర్టు ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించిన ప్రశాంత్ భూషణ్.. సంభాషణ జరిగిన మాట వాస్తవమే కానీ ఎలాంటి క్రిమినల్ కుట్ర సంభాషణలో లేదని వాదించారు. కొంతమంది వక్రీకరించిన సంభాషణను హైకోర్టుకు సమర్పించారని.. పూర్తి స్థాయిలో తర్జుమా చేసిన సంభాషణను సుప్రీంకోర్టుకు అందజేసినట్లు ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.