ఈ నెల ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వంలో విలీనమై, ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా మారడంతో.. వారికి ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటిపై చర్చించేందుకు ఆర్టీసీ పాలక మండలి నేడు సమావేశం కానుంది. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ఏయే నిబంధనలు అమలు చేయాలనే దానిపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి ఆధారంగా ప్రభుత్వ సర్వీసు నిబంధనలన్నింటినీ ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో ఆమోదించనున్నారు.
వాటిలో కొన్ని అంశాలు..
* పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్టీసీ ట్రస్ట్ ద్వారా చెల్లించే సిబ్బంది పదవీ విరమణ ప్రయోజన పథకం (ఎస్‌ఆర్‌బీఎస్), ఉద్యోగి చనిపోతే రూ.1.5 లక్షలు అందజేసే ఉద్యోగి ప్రయోజన థ్రెఫ్ట్ పథకం (ఎస్బీటీఎస్) రద్దవుతాయి. వీటి కోసం ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా తీసుకునే కొంత మొత్తాన్ని ఈ నెల నుంచి తీసుకోరు.
* ఆర్టీసీలో ఇప్పటి వరకు ఉన్న ఈపీఎఫ్-95ను ప్రస్తుతానికి కొనసాగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు అమలుపై నిర్ణయం తీసుకుంటారు.
* పీఆర్సీ సూచనలతో ఆర్టీసీ ఉద్యోగుల పే స్కేల్స్ ఖరారు చేస్తారు.
* ఆర్టీసీలో ఉండే వైద్యసేవల విధానం రద్దవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే వైద్య సేవల విధానం అమల్లోకి వస్తుంది.
* కార్మిక సంఘాలు ఉండవు. ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే ఉద్యోగుల సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సమ్మె చేయడం ఇకపై కుదరదు.