రాజధాని నగరంలో ప్రధాన నిర్మాణాలు
- సచివాలయం
- విభాగాధిపతుల కార్యాలయ భవనాలు
- హైకోర్టు
- శాసనసభ, శాసనమండలి భవనం
- రాజ్‌భవన్
- ముఖ్యమంత్రి నివాస భవనం
- హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అఖిలభారత సర్వీసులు, ఇతర అధికారులు, ఉద్యోగులకు నివాస భవనాలు
కొందరి వాదన..
రాజధాని అమరావతి ప్రాంతమంతా నల్లరేగడి నేల. ఇక్కడ భూమిలో 40 మీటర్ల లోతుకు వెళితే తప్ప రాయి తగలదు. భవనాల నిర్మాణానికి పైల్స్ వేసి పునాదులు నిర్మించాలి. ఇతర నగరాలతో పోలిస్తే అమరావతిలో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని.
వాస్తవం ఇదీ..
217 చ.కి.మీ. పరిధిలోని అమరావతిలో రాతి నేల తగలాలంటే అన్ని చోట్లా 40 మీటర్ల లోతు వరకు వెళ్లాల్సిన అవసరమే లేదు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు నిర్మిస్తున్న చోట 10 మీటర్ల లోతులోనే రాతి నేల తగిలింది. అక్కడ నిర్మిస్తున్న 40-50 అంతస్తుల ఐకానిక్ భవనాల పునాదులకు పైల్స్ వేయ లేదు. ర్యాప్ట్ ఫౌండేషన్‌తోనే నిర్మాణం చేపట్టారు. హైకోర్టు భవనం ప్రాంతంలోనూ 10 మీటర్ల లోతులోనే రాతిపొర తగిలింది. ఆ భవనానికి కూడా ర్యాఫ్ట్ ఫౌండేషనే వేశారు. అలానే అన్ని చోట్లా, అన్ని భవనాలకు 40 మీటర్ల లోపలి వరకు పైల్స్ వేయాల్సిన అవసరమూ లేదు.
నిర్మాణ రంగ నిపుణుల మాట ఇదీ..
దేశంలో మరెక్కడా నల్లరేగడి నేలల్లో నిర్మాణాలు చేయనట్టు కొందరు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కోల్‌కతా, చెన్నై, ముంబయిల్లో నేలలు, అమరావతిలో కంటే గొప్పవేం కాదు! ప్రపంచంలోని గొప్ప నగరాలు సముద్ర, నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయి. సింగపూర్, దుబాయిల్లో సముద్రాన్ని పూడ్చి మరీ ఆకాశ హర్మ్యాలు నిర్మించారు. అమరావతిలో నేలల గురించి పదే పదే మాట్లాడుతున్నవారు ఈ వాస్తవాల్ని ఎందుకు విస్మరిస్తున్నారు?
రాయిని తవ్వే ఖర్చు తగ్గినట్టేగా
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాల పునాదుల నిర్మాణానికి హైదరాబాద్‌లోని రాతి నేలల్లో నిర్మించే భవనాల పునాదులకంటే తక్కువ ఖర్చయిందని సీఆర్‌డీఏ ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
- అమరావతిలో ఒక్కో భవనానికి 10 మీటర్ల లోతు వరకు తవ్వి, అక్కడి నుంచి 4 మీటర్ల మందంతో ర్యాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. ఇలాంటి బహుళ అంతస్తుల భవనాల్ని హైదరాబాద్‌లో నిర్మించినా ర్యాఫ్ట్ ఫౌండేషన్ మందం 4 మీటర్లు ఉండాల్సిందే. అప్పుడు కూడా భూమి లోపలికి 10 మీటర్ల వరకు తవ్వక తప్పదు. అక్కడ ఒకటి రెండు మీటర్ల లోతులోనే రాయి తగిలినా... ఆ రాతిని తొలగించి, అవసరమైన లోతు వరకు తవ్వాకే పునాదులు వేయాలి. అక్కడ రాతి నేలను తవ్వడానికి, రాయిని వెలికితీయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. అమరావతిలో సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలు నిర్మించిన చోట రాయిని తవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఖర్చు మిగిలినట్టేనని, హైదరాబాద్‌తో పోలిస్తే ఆ మేరకు డబ్బు ఆదా అయినట్టేనని నిపుణులు అంటున్నారు.
- సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనాన్ని 50 అంతస్తులతో (సుమారు 225 మీటర్ల ఎత్తు), మిగతా నాలుగు టవర్లను 40 అంతస్తులతో (సుమారు 175 మీటర్ల ఎత్తు) నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ పునాదికి 1500 టన్నుల ఇనుము, 12 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్ వినియోగించారు.
- అమరావతిపై కొందరు చేస్తున్న ఆరోపణలే నిజమైతే... అంత ఎత్తున్న భవనాలకు 40 మీటర్ల కంటే ఎక్కువ లోతుకి వెళ్లి పునాదులు వెయ్యాలి. కానీ ఇక్కడ 10 మీటర్లలోపే రాతి నేల తగలడంతో ర్యాఫ్ట్ ఫౌండేషన్ సరిపోయింది.
- సచివాలయం టవర్లు నిర్మిస్తున్న ప్రాంతంలో నేల బరువుని మోసే సామర్థ్యం (సాయిల్ బేరింగ్ కెపాసిటీ-ఎస్‌బీసీ) ఒక చదరపు మీటరుకి 150 టన్నులుగా ముంబయికి చెందిన సంస్థ ధ్రువీకరించింది. దీనిని చెన్నై ఐఐటీ నిపుణులూ ఆమోదించారు
అన్ని భవనాలకూ పైల్ ఫౌండేషన్ అవసరం లేదు
- అమరావతి వంటి నల్లరేగడి మట్టి ఉన్న నేలల్లో పునాదుల నిర్మాణానికి 6 శాతం అదనంగా ఖర్చవుతుందని అంచనా. అయితే ఇక్కడ నిర్మించే ప్రభుత్వ, ప్రైవేటు భవనాలన్నీ ఆకాశహర్మ్యాలు కాదు. వ్యక్తిగత గృహాలు, విల్లాలు, గ్రూప్ హౌస్‌లు, తక్కువ విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్‌మెంట్‌లు వంటివి ఐదంతస్తులకు మించవు. వాటికి పునాదుల ఖర్చు మిగతా ప్రాంతాల్లో ఎంతవుతుందో అంతే అవుతుంది. ఇలాంటి భవనాలకు ‘ఓపెన్ ఫౌండేషన్’ విధానంలో పునాదులు నిర్మించవచ్చు. పరిపాలన నగరంలో మంత్రులు, న్యాయమూర్తులు, అధికారులకు నిర్మిస్తున్న బంగ్లాల పునాదులు ఈ విధానంలోనే వేశారు.
- భవనాల ఎత్తు, బరువు (లోడ్) పెరిగే కొద్దీ, ఆ భవనం నిర్మిస్తున్న ప్రదేశంలో నేల స్వభావాన్ని బట్టి పైల్స్ ఎంత లోతు వరకు వెయ్యాలి, పైల్ చుట్టుకొలత ఎంతుండాలి అన్నది ఆధారపడి ఉంటుంది. తక్కువ ఎత్తులో నిర్మించే భవనాలకు ‘బల్బ్’ టెక్నాలజీతో తక్కువ లోతు వరకే పైల్స్ వేయవచ్చు.
- ఒక్కోసారి 40 మీటర్ల లోతులో రాతిపొర ఉంటే.. అక్కడి వరకూ కూడా పైల్స్ వేయాల్సిన అవసరం ఉండదు. రాతిపొరకు పైన ఉండే గ్రావెల్ పొర బలంగా ఉంటే అక్కడి వరకు పైల్స్ వేస్తే సరిపోతుంది. ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంతంలో 40 మీటర్ల లోతులో రాతి పొరలు ఉన్నప్పటికీ గరిష్ఠంగా 30-33 మీటర్ల వరకే పైల్స్ వేశారు.
- రాజధాని ప్రాంతం మొత్తంలో రాతి పొరలు 10 మీటర్ల నుంచి 40 మీటర్ల లోతులో ఉన్నాయి. నది నుంచి 2 కి.మీ.ల దూరం వరకు ఉన్న ప్రాంతాల్లో 40 మీటర్ల లోతు లోపే రాతి పొర ఉంది. గ్రావెల్, కొండ ప్రాంతాలున్న చోట 10 మీటర్ల లోతులోనే రాతి పొర తగులుతోంది.
పూర్తయ్యాక.. ఆ ఖర్చును బూచిగా చూపుతారా?
పరిపాలన నగరంలో శాసనసభ భవనం, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాస భవనం తప్ప.. మిగతా భవనాల నిర్మాణం మొదలైంది. కీలకమైన సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలకు పునాదుల నిర్మాణం పూర్తయింది. డయాగ్రిడ్ ఫ్రేమ్‌ల నిర్మాణం పనులూ మొదలయ్యాయి. కొత్తగా వేయాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితిలో పునాదుల ఖర్చును బూచిగా చూపించి.. రాజధానిని ఇక్కడి నుంచి తరలించాలనుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పరిపాలన నగరంలో నేల స్వభావం ఇదీ!
- పరిపాలన నగరంలో భూమి పటుత్వాన్ని నిర్ధరించేందుకు సుమారు 75 వరకు బోరు రంధ్రాలు వేసి పరీక్షలు నిర్వహించారు.
- సుమారు ఒక కి.మీ. వెడల్పు, 7 కి.మీ. పొడవు ఉన్న ఈ ప్రాంతంలో నేల కింద రాతి పొర ఒక్కో చోట ఒక్కో లోతులో ఉంది. దీని ఆధారంగా ఆయా చోట్ల జీ+12 భవనాలకు 15, 18, 21, 28, 40 మీటర్ల లోతు వరకు పైల్స్ వేయాలని నిపుణులు సిఫార్సు చేశారు.
అన్నీ ఒక్కచోటే
వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, సచివాలయ సిబ్బంది అంతా ఒకే చోట ఉంటే పాలన సులువవుతుంది. ఈ ఉద్దేశంతో అమరావతిలో సచివాలయం, హెచ్‌ఓడీ భవనాల్ని ఒకేచోట డిజైన్ చేశారు.
అక్కడ సముద్రాలనే పూడుస్తున్నారు
సింగపూర్ వంటి చోట్ల 60 మీటర్ల లోతు వరకు పైల్స్ వేసి పునాదులు నిర్మిస్తున్నారు. సింగపూర్ సహా చాలా దేశాల్లో నేల లభ్యత తక్కువగా ఉండటంతో, కొంత మేర సముద్రాన్ని పూడ్చి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. మన దేశంలో ముంబయిలో కూడా స్వాతంత్య్రానికి ముందు నుంచి అరేబియా సముద్రం లోపలికి చొచ్చుకు వెళ్లి, కొంత మేర పూడ్చి, చిన్న చిన్న దీవుల్ని ఏకం చేసి నిర్మాణాలు చేశారు. సింగపూర్‌లో జురాంగ్ ఐలాండ్ పేరుతో సముద్రాన్ని పూడ్చి పారిశ్రామికవాడనే నిర్మించారు. గల్ఫ్ దేశాల్లో పామ్ ఐలాండ్, ఖతార్ పెర్ల్ వంటివి ఇలా నిర్మించినవే. అక్కడ సముద్రాల్నే పూడ్చి, భూమిలో 60-70 మీటర్ల వరకు పునాదులు వేసి, భవనాలు నిర్మిస్తున్నప్పుడు.. అమరావతి వంటి చోట్ల ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : రాజధాని గ్రామాల్లో భారీగా సాయుధ దళాల మోహరింపు
.