నిబంధనలు పాటించని ఐస్క్రీమ్ పరిశ్రమలపై చర్యలు - icecreams
గత వారం విజయవాడ నగర పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఐస్క్రీమ్ పరిశ్రమలపై ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు.
విజయవాడ నగర పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఐస్క్రీమ్ పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. గత వారం ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన సమయంలో పలు కంపెనీల యాజమాన్యాలు అపరిశుభ్ర వాతావారణంలో పరిశ్రమలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి... 3 పరిశ్రమలకు 50 వేల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. మొదటి తప్పుగా 50 వేల రూపాయల జరిమానాతో వదిలేస్తున్నామని...మరోసారి తనిఖీల్లో పట్టుబడితే పరిశ్రమను శాశ్వతంగా మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోరంకిలోని ఓ ఐస్ క్రీమ్ పరిశ్రమ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించామని... ఆ పరిశ్రమను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని... జరిమానా విధించిన పరిశ్రమల్లో వారం రోజుల్లో మరోసారి తనిఖీలు ఉంటాయని... నిబంధనలు అమలు చేయకపోతే శాశ్వతంగా మూసివేస్తామని స్పష్టం చేశారు.