కరోనాపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను మోదీ దృష్టికి ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక లావాదేవీలు మందగించాయని.. ప్రధానితో సీఎం జగన్ చెప్పారు.
వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగానూ ఈ నిధులు ఖర్చు చేస్తున్నాం. కేంద్రం ఆర్థికంగా రాష్ట్రానికి సహకరించాలి. అవసరమైతే వడ్డీ రహిత రుణాన్ని మంజూరు చేయాలి. వడ్డీ లేని రుణంతో పాటు దీర్ఘకాలిక చెల్లింపునకు అనుమతించాలి -సీఎం జగన్
ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో లేకుండా రుణం మంజూరు చేస్తే వెసులుబాటు అవుతుంది. వలస కూలీలకు ఇబ్బందిలేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. సరకు, ప్రజా రవాణా రాష్ట్రాల మధ్య నిరంతరం జరిగేలా చూడాలి. రాబోయే రోజుల్లో కొవిడ్‌తో కలిసి జీవించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. కరోనా సోకిన వ్యక్తులు స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకొచ్చేలా వాతావరణం కల్పించాలి. సాంఘికంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు -ముఖ్యమంత్రి జగన్
వ్యాక్సిన్ వచ్చేవరకూ వైరస్‌తో ముందుకు...
కేంద్రం సూచనలతో కరోనా కేసులను నియంత్రించగలిగామని సీఎం జగన్ ప్రధానితో అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్న సీఎం.. క్వారంటైన్ ప్రక్రియపై మరోసారి ఆలోచన చేయాలన్నారు. వ్యాక్సిన్ వచ్చేవరకు వైరస్‌తో కలిసి ముందుకు సాగాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిందని జగన్.. మోదీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి అవరోధాలు తొలగాలని కోరారు. ప్రజా రవాణాలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేయాలన్న ముఖ్యమంత్రి... దుకాణ సముదాయాలు తెరిచేందుకు అవకాశం కల్పించాలన్నారు.
వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.16 వేల కోట్లు ఖర్చవుతుందని.. రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా ఉండాలని ప్రధానిని కోరారు. రాష్ట్రంలో దాదాపు 87 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయని.. ఎంఎస్‌ఎంఈలలో 9.7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు 6 నెలల పాటు వడ్డీ మాఫీ చేయాలని మోదీతో జగన్ చెప్పారు.
ఇదీ చదవండి:విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన