విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణను నిరసిస్తూ... ఉద్యోగుల ఆందోళన Power employees protest: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణ, జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
కడప జిల్లాలో
కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ.. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి ప్లాంట్ ఆవరణలోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కృష్ణపట్నం ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. వేతనాల విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లాలో
దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.లాభాలబాటలో ఉన్న ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం ఏంటని నిలదీశారు. తమ జీవితాలను ప్రభుత్వం చీకటిలోకి నెట్టిందంటూ... విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఎనర్జీ సెక్రటరీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి.. ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లాలో
శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం, స్విచ్ యార్డ్ వద్ద జెన్కో ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని సహాయ నిరాకరణకు దిగారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటు పరం చేసే చర్యలు ఆపాలన్నారు. 2020 విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరణ చేపట్టాలని, మెరుగైన మెడికల్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖలో..
విద్యుత్ సంస్థల యాజమాన్యాలు విద్యుత్ కార్మికులు, అధికారుల సంక్షేమం పట్ల తాత్సార ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐకాస విశాఖలో ఆరోపించింది. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ విశాఖలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
మంత్రి బాలినేనితో విద్యుత్ ఉద్యోగుల భేటీ
వేతనాల చెల్లింపు, కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ తదితర అంశాలపై.... మంత్రి బాలినేనితో విద్యుత్ ఉద్యోగుల భేటీ అయ్యారు. జనవరి వేతనాల చెల్లింపుపై మంత్రితో చర్చించిన ఉద్యోగులు... సహాయ నిరాకరణ వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. నల్లబ్యాడ్జీలతో భోజన విరామ సమయాల్లో నిరసనలు తెలపనున్నట్లు వెల్లడించారు. ఈనెల 17 నుంచి వర్క్ టూ రూల్ ప్రకారం పనిచేస్తామన్నారు. ఈనెల 28 నుంచి ప్రభుత్వం ఇచ్చిన సిమ్‌లు, సమాచార సాధనాలు వెనక్కిస్తామన్నారు..
ఇదీ చదవండి