పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలని, పరిహారం చెల్లించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌లో బుధవారం ఆందోళన నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ విషయమై ఇటీవల జల్‌శక్తి మంత్రిని కలిసిన వైకాపా ఎంపీలు నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివాసులు, నిర్వాసితులు మునిగిపోతున్నా భాజపా కనీసం సహాయ చర్యలు చేపట్టడంలేదని మండిపడ్డారు.
పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలను పట్టించుకోని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో గిరిజనులు, దళితుల అంశాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని తెదేపా లోక్‌సభ పక్షనేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పోలవరం నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకునే బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. తెదేపా పోలవరం నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తోందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ గుర్తుచేశారు.
పోలవరం నిర్వాసితుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జయకుమార్ తెలియజేశారు. తక్షణ సహాయం కింద ప్రతి నిర్వాసిత కుటుంబానికి నెలకు రూ.7,500 చొప్పున మూడు నెలలుపాటు ఇవ్వాలని, నిత్యావసర సరకులు ఇవ్వాలని సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు కోరారు. నిర్వాసితులను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసిందని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు.