ROADS IN AVANIGADDA : విజయవాడ, అవనిగడ్డ రహదారి మార్గంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన అనేక గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఓ వైపు కృష్ణానది, మరోవైపు పంట కాలువ ఉండే ఈ దారిలో.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వాహనం.. కాల్వలోకి దూసుకెళ్లే పరిస్థితి. ఈ రహదారి గుంతలతో పూర్తి అధ్వానంగా మారడంతో.. తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దారుణంగా దెబ్బతిన్న రహదారిపై ప్రయాణించే క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు.
అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు సహా ప్రైవేటు వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు వేలాదిగా తిరుగుతుంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అందరికి ఉపయుక్తంగా ఉన్న రహదారి.. కొంతకాలంగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. భారీ గుంతల వల్ల ఈ మార్గంలో ప్రయాణించాలంటనే వాహనదారులు హడలిపోతున్నారు. కృష్ణానది నుంచి ఇసుక తరలించే టిప్పర్లు, ట్రాక్టర్ల వల్ల పలుచోట్ల రహదారి కుంగిపోయింది. పెద్ద పెద్ద బీటలు పడటంతో.. రహదారి ఎగుడు దిగుడుగా తయారైంది. భారీ వాహనాలు ఎదురుగా వస్తే ద్విచక్రవాహనదారులు అదుపు తప్పి పంట కాలువలోకి వెళ్లే పరిస్థితి. ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు వాపోతున్నారు.