Mobile App For Farmers: రెండు విభాగాల సమన్వయం, రెండేళ్ల కృషి, ఇద్దరు విద్యార్థులు కలిసి పట్టుదలతో... పట్టు రైతులకు ఆసరాగా నిలిచేలా... రెండు మొబైల్ యాప్‌లు రూపొందించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు... పట్టు రైతుల కోసం సరికొత్త ఆవిష్కరణలు చేశారు. వారు రూపకల్పన చేసిన పరికరాలు, యాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థినులు హరిప్రియ, పల్లవి కలిసి పట్టు రైతులకు ఉపయోగపడేలా రెండు సరికొత్త పరికరాలను, యాప్‌లను రూపొందించారు. ఉష్ణోగ్రత, తేమశాతంతో పాటు వర్షపాతం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, దానివల్ల పంటలకు వచ్చే రోగాలను ముందుగానే రైతులకు తెలియజేసేలా తెగులు నిర్ధారణ పరికరాన్ని రూపొందించారు. పట్టు పురుగుల కేంద్రంలో ఉష్ణోగ్రత వివరాలను తెలిపేలా సూక్ష్మ వాతావరణ నియంత్రణ పరికరం తయారుచేశారు.
పెట్టుబడులు, దిగుబడులు, లాభ నష్టాల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా సెరిటోరింగ్ పేరుతో యాప్ రూపకల్పన చేశారు. పట్టు పంటలో చీడపీడల రకాలు, వాటి నివారణకు నిపుణుల సలహాలు పొందేందుకు సెరిటోరింగ్ మాక్ పేరుతో మరో యాప్ తయారుచేశారు. తాము రూపొందించిన పరికరాలను ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ సాంకేతికతతో అనుసంధానించటం వల్ల సమాచారం ఎప్పటికప్పుడు రైతుల చరవాణికి సంక్షిప్త సందేశాలుగా అందుతుందని విద్యార్థినులు తెలిపారు. తాము రూపొందించిన పరికరాలు, యాప్‌లపై కొంతమంది రైతులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
పట్టు రైతులకు ఆసరాగా..పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థినులు రైతులకు తక్కువ ఖర్చుతో, ఉపయోగకరంగా ఉండేందుకు ఈ పరికరాలు, యాప్‌లు రూపొందించేలా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసినట్లు పద్మావతి మహిళా వర్శిటీ రిజిస్ట్రార్ మమత తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, బయోసైన్స్ అండ్ సెరికల్చర్ విభాగాల సమన్వయంతో పరిశోధన సాగిందని చెప్పారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో జింకల కళేబరాలు కలకలం