రాష్ట్రంలో త్వరలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు(organic policy review meeting at vijayawada by minister kanna babu) స్ఫష్టం చేశారు. సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయంతో పాటు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ప్రజలకు చేరేందుకు.. ఈ విధానం తోడ్పడుతుందని వెల్లడించారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో దీనిపై మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానంపై నిర్వహించిన ఈ సమావేశానికి రైతులు, ఎఫ్పీఓ ప్రతినిధులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతం చేసేందుకు.. ఈ నూతన విధానం ఉపకరిస్తుందని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి సహాయంగా రెండు దశల్లో 5,000 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పొలంబడి ద్వారా వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు రైతులను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఉత్పత్తి తగ్గకుండా రసాయనాలు, పురుగు మందుల వినియోగాలను కనిష్ఠ స్థాయికి తీసుకువచ్చేలా కార్యాచరణ ఉండాలని మంత్రి శాస్త్రవేత్తలకు సూచించారు. మరోవైపు సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణతో పాటు శిక్షణ, పనిముట్లు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఆర్గానిక్ ఉత్పత్తులపై విస్తృత ప్రచారంపైనా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.