ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కనీస వేతనం ఇవ్వాల్సిందేనని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్ - ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

మినిమం టైం స్కేల్ వేతనం వర్తింపచేయాలని నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ నివాస్‌తో ఎన్​హెచ్​ఎం సంఘాల నేతలు సమావేశమయ్యారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్

By

Published : Aug 17, 2022, 12:00 PM IST

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగసంఘాల నేతలతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కొత్త పీఆర్సీకి అనుగుణంగా కనీస వేతనం చెల్లింపు విధానాన్ని అమలుచేయాలని రాష్ట్రంలోని 25 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ మంగళవారం ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 2018 నుంచి ప్రతి ఏడాది 5% చొప్పున ఇప్పటివరకు 25% పెంచుతామని నివాస్‌ ప్రతిపాదించారు. ఏపీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నేతలు మాత్రం కనీస వేతనం చెల్లించాలని పట్టుబట్టారు. ఈ నెల 18న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నివాస్‌ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య పథకాల అమలు కింద వీరిని ప్రభుత్వం విధుల్లోకి తీసుకుందన్నారు. వారు ప్రభుత్వపరంగా మంజూరైన పోస్టుల్లో పనిచేయడం లేదని తెలిపారు. సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, ఉపాధ్యాయుల జేఏసీ ఛైర్మన్‌ నాగేశ్వరరావు, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నేతలు దయామణి, ప్రభాకర్‌రెడ్డి, సింహాచలం, సీహెచ్‌ రాఘవేంద్రరావు, వైవీ రవిసింగ్‌, రవీంద్రబాబు, ఆయుష్‌ వైద్యులు జీఎన్‌వీ ప్రసాద్‌, ప్రదీప్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

రెండు విధాలా నష్టం:వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు రెండు విధాలా నష్టపోతున్నారు. 11వ పీఆర్సీ ప్రకారం కనీస స్థాయిలో వేతనాలు పెంచకపోగా.. వార్షిక ఆదాయాన్ని అనుసరించి తమ కుటుంబసభ్యులకు సంక్షేమ పథకాలు దూరం చేశారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఒకే విద్యార్హతతో ఒకే రకమైన విధులు నిర్వహిస్తున్నా.. వేతనాల్లో తేడాలున్నాయి. ఎన్‌హెచ్‌ఎం కింద పనిచేసేవారిలో స్పెషలిస్టు వైద్యుల (ఆర్థో, జనరల్‌ ఫిజిషియన్‌, ఈఎన్‌టీ) నుంచి క్లాస్‌ 4 వరకు 57 విభాగాల వారు ఉన్నారు. ఉద్యోగుల వ్యవహారాలు రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాధానంలో స్పష్టంచేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని జేఏసీ నేతలు ఏడుకొండలు, రవీనాజ్యోతి పేర్కొన్నారు.

వేతనాల్లో వ్యత్యాసాలు

  • కొత్త పీఆర్సీ ప్రకారం ఎంబీబీఎస్‌ వైద్యులకు రూ.61,960 చెల్లించాలి. ప్రస్తుతం రూ.46,000 ఇస్తున్నారు. పదో పీఆర్సీ ప్రకారం.. రూ.55,000 ఇవ్వాలి.
  • స్టాఫ్‌నర్సుకు కొత్త పీఆర్సీ ప్రకారం రూ.38,720 ఇవ్వాలి. ప్రస్తుతం రూ.22,500 అందుతోంది. పదో పీఆర్సీ ప్రకారం రూ.34,318 ఇవ్వాలి.
  • ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు కొత్త పీఆర్సీ ప్రకారం రూ.32,670 చెల్లించాలి. పాత పీఆర్సీ ప్రకారం రూ.28,000 చెల్లించాలి. కొందరు రూ.19,019 మాత్రమే అందుకుంటున్నారు.

బదిలీలు లేవు:2006 నుంచి ఒకేచోట పనిచేస్తున్నారు. తమనూ బదిలీ చేయాలని అధికారులు దస్త్రం సిద్ధం చేసినా నిర్ణయం రావడం లేదని నేతలు దుర్గాప్రసాద్‌, సునీల్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రభుత్వ నోటిఫికేషన్ల ద్వారానే విధుల్లో చేరుతున్నాం కదా:రాష్ట్రప్రభుత్వ నోటిఫికేషన్ల ద్వారానే విధుల్లో చేరిన తమకూ మిగిలిన వారిలాగే వేతనాలు ఎందుకు చెల్లించరని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘కొవిడ్‌ హయాంలో మిగతా ఉద్యోగులకు తగ్గించిన సెలవులను పెంచారు. మాకు 15 సీఎల్స్‌ మాత్రమే ఇస్తున్నారు. పదో పీఆర్సీ ప్రకారం అందరికీ ఒకేలా కాకుండా.. పథకాలకు కేటాయించిన నిధులను అనుసరించి కొందరికి వేతనాల్లో కోత విధించడం ఎంతవరకు సమంజసం’ అని షేక్‌ ఖాజామస్తాన్‌, కేపీ నాయుడు, రత్నంరాజు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details