Medicines Price: ఏప్రిల్ 1 నుంచి ఔషధాల ధరల పెంపుదలకు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల దాదాపు 800 రకాల మందుల ధరలు పెరిగే వీలుంది. వాటిలో యాంటీ-బయాటిక్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలు, యాంటీసెప్టిక్స్, నొప్పి నివారణ మందులు, గ్యాస్ట్రోఇంటెస్టినల్, యాంటీ ఫంగల్ మందులు ఉన్నాయి. అంటే పారాసెటమాల్ నుంచి అజిత్రోమైసిన్, సిప్రోఫ్లాగ్జాసిన్, మెట్రానిడజోల్ తదితర మందులకు వచ్చే నెల నుంచి అధిక ధర చెల్లించక తప్పని పరిస్థితి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) పెరుగుదల ఆధారంగా మందుల ధరల పెంపునకు ఎన్‌పీపీఏ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
‘కేంద్ర ప్రభుత్వ వాణిజ్యశాఖ అందజేసిన సమాచారం ప్రకారం 2020తో పోల్చితే 2021 టోకు ధరల సూచీలో 10.766 శాతం మార్పు కనిపిస్తోంది. డీపీసీఓ, 2013 నిబంధనల ప్రకారం సంబంధిత విభాగాలు దీనికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలి..’’ అని నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫీసు మెమొరాండం జారీ చేసింది. తద్వారా ధరల పెంపునకు వీలు కల్పించినట్లు అయింది. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్, 2013 (డీపీసీఓ, 2013) ప్రకారం షెడ్యూల్డ్ ఔషధాల ధరలను టోకు ధరల సూచీకి అనుగుణంగా ఎన్‌పీపీఏ సవరించే అవకాశం ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ సవరణలు చేపడుతూ ఉంటారు. దీనికి అనుగుణంగా వచ్చే నెల నుంచి ధరల పెరుగుదలకు రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. దీని ప్రకారం షెడ్యూల్డ్ ఔషధాల ధరలను 10.766 శాతం వరకూ పెంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.