చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం, న్యాయస్థానాల్లో చివాట్లు తిని తోకముడిచి పారిపోవటం జగన్ కుటుంబానికి అలవాటేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. 'తండ్రి వల్లే కాలేదు..ఇక జగన్ ఎంత' అంటూ ఓ వీడియోను ట్వీటర్లో విడుదల చేశారు.
"22 ఏళ్లుగా సభా సంఘాలు, మంత్రుల కమిటీలు, సబ్ కమిటీలు వేయించటంతో పాటు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ ఎన్నో కేసులు చంద్రబాబుపై పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసినా అవినీతి మరక అంటించలేకపోయారు. ఒక్క ఆరోపణ కుడా రుజువు చేయలేకపోయినా..వైఎస్ కుటుంబం ఆ ప్రయత్నాలను మానుకోవట్లేదు. రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ విఫలమయ్యాక వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలనే వృథా ప్రయత్నం చేస్తున్నారు. 1999 నుంచి కేసుల పర్వం ప్రారంభించి చంద్రబాబుపై 24 కేసులు వేస్తే అన్నింటినీ న్యాయస్థానం కొట్టేసింది. సింహం గడ్డి తినని తరహాలోనే చంద్రబాబు ఎన్నడూ అవినీతికి పాల్పడరు" అంటూ ఘాటుగా విమర్శించారు.