తెలంగాణలో జరిగే మద్యం అమ్మకాల్లో సింహభాగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లోనే ఉంటాయి. సాధారణ రోజుల్లోనూ బీర్ అమ్మకాలు కాస్త ఎక్కువే. ఇక ఎండాకాలం వస్తే చాలు ఒక్కసారిగా అమ్మకాలు రెట్టింపు అవుతాయి. కానీ లాక్‌డౌన్ కారణంగా బీర్ విక్రయాలు భారీగా పడిపోయాయి. మద్యం దుకాణాలు ఈ నెల 6న తెరుచుకోగా.. మద్యం ప్రియులు మొదటి రెండు రోజులు ఎగబడ్డారు. ఆ తర్వాత రోజు నుంచి మద్యం అమ్మకాలు మందగించాయి. ఎక్కడ వారు అక్కడ ఉండిపోవడం, ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో బీర్ విక్రయాలు భారీగా పడిపోయాయని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ధరలు కూడా అమ్మకాలు పడిపోవడానికి ఒక కారణమని దుకాణదారులు పేర్కొంటున్నారు.
సగానికి పైగా పడిపోయిన సేల్స్..
2019 మే నెలలో 26.53లక్షల కేసుల లిక్కర్ అమ్ముడు పోగా... 60.12లక్షల కేసుల బీర్ విక్రయాలు జరిగాయి. అంటే సగటున రోజుకు 85వేల కేసుల లిక్కర్, 1.93లక్షల కేసుల బీర్ అమ్ముడుపోయేది. అదే ఈ నెలలో గత ఆరు రోజుల్లో 9.39లక్షల కేసుల లిక్కర్, కేవలం 6.47లక్షల కేసుల బీర్ విక్రయం జరిగింది. దీనిని బట్టి బీర్ సేల్స్ సగానికి సగం పడి పోయాయని స్పష్టమవుతోంది.