విలక్షణ ఉద్యమ నేత కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు సంస్మరణ సభను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. సభలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని...నాగేశ్వరరావుతో ఉన్న సాన్నిహిత్యమే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. గోదావరి జలాలను తెలంగాణకు మళ్లించటానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయనకు ప్రాంతాలు, కుల,మత భేదాలు లేవన్నారు. డెల్టా పరిరక్షణ కమిటీ పేరుతో డెల్టా అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తుచేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన రైతుల ప్రయోజనాల కోసమే పని చేశారన్నారు.
కొల్లి నాగేశ్వరరావు జీవించి ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించేవారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యవసాయ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకునేదాకా ఉద్యమించాల్సిన అవసరం ఉందని...,ఇదే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళన్నారు. నిత్యం రైతు సంక్షేమం కోసం కొల్లి నాగేశ్వరరావు కృషి చేశారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యనించారు. పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టులు ఆయన మది నుంచి వచ్చినవేనని తెలిపారు.