చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలిచివేసింది తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరంలోని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం తన హృదయాన్ని కలిచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. తానున్నానని ధైర్యం చెప్పారు. తల్లిదండ్రుల బాధను చూసి భావోద్వేగానికి లోనైన జనసేనాని.. నిందితునికి శిక్ష పడే వరకు పోరాడతానని భరోసా ఇచ్చారు.
శిక్ష పడేవరకు పోరాడతాం..
"చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలిచివేసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. అమ్మాయి తల్లిదండ్రులకు ఈ సమయంలో ఓదార్పు అవసరం. దోషికి శిక్ష పడేవరకు జనసేన పోరాడుతుంది. బాలిక తల్లిదండ్రులు రాజుపై ముందే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సరిగా స్పందించలేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు."- పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు.
అభిమానుల వల్ల ఆటంకం..
చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు కాసేపు ఆటంకం ఏర్పడింది. కారు దిగే పరిస్థితి లేకుండా.. ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్‌కల్యాణ్ వస్తున్నాడని తెలిసి.. పెద్దఎత్తున అభిమానులు సింగరేణి కాలనీకి చేరుకున్నారు. సింగరేణి కాలనీకి పవన్ చేరుకోగానే.. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. అభిమానుల రద్దీ వల్ల కారు దిగలేక పవన్ ఇబ్బంది పడ్డారు. అభిమానుల తోపులాటలో ఓ స్థానికుడి కారు కూడా ధ్వంసమైంది. అభిమానుల తీరుతో పవన్ ఒకింత అసహనానికి గురైనట్టు సమాచారం. కారు దగ్గరికే చిన్నారి తండ్రిని పిలిపించుకుని ఓదార్చారు.
ఈ నెల 9న చిన్నారిపై రాజు అనే కామాంధుడు.. అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన రోజు నుంచి విపక్ష నేతలు, పలువురు ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ధైర్యం చెప్పారు. నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నా.. పట్టుబడకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. నిందితుడు రాజును పట్టిస్తే పది లక్షల రివార్డును అందిస్తామని పోలీసులు మంగళవారం ప్రకటించారు.
ఇదీ చూడండి:
LOKESH: ఒక్క ఛాన్స్ సీఎం జగన్ ఏపీని ఆప్ఘనిస్తాన్‌లా మార్చేశారు: నారా లోకేశ్