Crop Insurance: ఉచిత పంటల బీమా అంతా అగమ్యగోచరంగా తయారైంది. ఈ-పంటలో నమోదు చేసినా బీమా రాలేదని కొందరు.. ఈ-కేవైసీ చేసినా సమాచారం గల్లంతైందని మరికొందరు రైతులు వాపోతున్నారు. ఈ-పంటలో నమోదై, ఈ-కేవైసీ చేయించుకోని వారందరికీ మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్ వరకు అంతా పారదర్శకమే అంటున్నా.. ఎక్కడ ఏ పంటకు ఎంత పరిహారం ఇచ్చారనే వివరాలను ఆన్లైన్లో ఉంచడానికి ఎందుకు వెనకాడుతున్నారని రైతుసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.50వేల లోపు మంజూరైన వారికే జమయ్యాయి.
అంతకుమించి మంజూరైన వారికి ఖాతాల్లో ఎప్పుడు జమచేస్తారనే సమాచారమూ లేదు. చాలాచోట్ల అర్జీలు తీసుకోవడం లేదు. ఈ-పంట విధానంలో లోపాలున్నాయని వ్యవసాయాధికారుల నుంచి అంతా అంగీకరిస్తున్నారు.
ఈ-పంట, ఈ-క్రాప్ 100% వాస్తవమా?..ఈ-పంట నమోదు తప్పులతడకగా ఉందని వ్యవసాయ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. సాగు చేయని రైతుల పేర్లతో ఈ-క్రాప్ చేశారని ప్రకాశం జిల్లాలోని పలు రైతుభరోసా కేంద్రాల వద్ద కర్షకులు ఆందోళనలు చేశారు. కర్నూలు జిల్లాలో కొండలు, గుట్టలను కూడా పంట భూములుగా చూపించి పరిహారం ఇచ్చారు.
- ఈ-కేవైసీ చేసినా తర్వాత సమాచారం కనిపించడం లేదని, వేలిముద్ర వేయనట్లే కనిపిస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని కొందరు రైతుభరోసా కేంద్రాల సిబ్బందే చెబుతున్నారు. సర్వర్ ఇతర సమస్యలతో వేలిముద్రలు నమోదు కాలేదు. ఇలాంటి లోపాలకు తమను బాధ్యుల్ని చేసి నష్టపరిహారం ఇవ్వకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
- గతంలో ఈ-క్రాప్ వివరాలను ఆన్లైన్లో ఉంచేవారు. అప్పుడు సర్వే నంబర్ల వారీగా చూస్తే శ్మశానాలు, వాగులు, రోడ్లు, చెరువుల్ని కూడా సాగు భూములుగా నమోదుచేసిన వైనం బయటపడింది. ఎక్కడా సెంటు సాగు లేకున్నా.. ప్రకాశం జిల్లాలో దాల్చిన చెక్క వేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ఇలాంటి లోపాలను సరిదిద్దకుండా.. ఆన్లైన్లో కనిపించకుండా చేస్తోందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
- వాస్తవానికి మండలంలో మొత్తం సాగువిస్తీర్ణం, ఈ-క్రాప్‌లో నమోదైన విస్తీర్ణం సరిపోవాలి. చాలాచోట్ల పెద్దఎత్తున వ్యత్యాసం ఉంది. ఎవరి పేరుతో ఎంత పంట విస్తీర్ణం నమోదైందనే వివరాలను మాత్రం తెలియనీయట్లేదు. రసీదులూ ఇవ్వట్లేదు. గతేడాది ఈ-పంట నమోదు పేరుతో ఒకసారి, ఈ-కేవైసీ పేరుతో మరోసారి, పొలంలో ఫొటో కావాలంటూ ఇంకోసారి సాగదీయడమూ సమస్యలను సృష్టించింది.
కావాలనే లెక్క తగ్గించారా?..పంటల బీమాపై గతంలో చెప్పిన లెక్కలకు, ఇప్పుడు పరిహారం మంజూరైన జాబితాలకు భారీగా తేడా ఉందని కొందరు వ్యవసాయ అధికారులే అంగీకరిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తొలుత 4,814 మంది రైతుల పేర్లతో అర్హుల జాబితా ఇవ్వగా.. తర్వాత 2,129 మందికే వర్తించింది. ఇలా చాలా మండలాల్లో లెక్కలు తప్పాయి.