ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ఉద్ధృతి పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు ఉపనదుల ప్రవాహం కలుస్తున్న కారణంగా.. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉగ్రరూపం దాల్చుతోంది. గంటగంటకూ ప్రవాహం పెరుగుతుండగా.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి...70 గేట్లును పూర్తిగా తెరిచారు. కృష్ణానదికి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత ఇన్ ఫ్లో 5,11,694 క్యూసెక్కులు కాగా...,అవుట్ ఫ్లో 5,06,604 క్యూసెక్కులు.
వరద పరిస్థితిపై జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న వరద ప్రవాహం క్రమేణా పెరిగి రాత్రికి వరద ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని కలెక్టర్ అధికారులకు తెలిపారు. పెరుగుతున్న వరద దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇవాళ రాత్రి 10 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
అధికారులకు మంత్రి అనిల్ ఫోన్...
కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో పాటు అనంతపురం జిల్లా అధికారులతో మంత్రి అనిల్ ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదలశాఖ సీఈలకు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉద్ధృతి పెరుగుతున్నందున ప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను తరలించాలని ఆదేశించారు.