ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2022, 7:38 AM IST

ETV Bharat / city

అసంతృప్తికి కారణమయ్యారు.. అసమ్మతిగా మిగిలిపోయారు

Balineni Srinivasa Reddy: ‘మంత్రులందరినీ మార్చేస్తున్నారు’ అని మొట్టమొదట బహిరంగంగా ప్రకటన చేయడం ద్వారా తన సహచర మంత్రులందరిలో అసంతృప్తి రేగేందుకు కారకుడయ్యారాయన.. ముఖ్యమంత్రి మాటను ఆయన నోట పలికారన్న చర్చ అప్పట్లో జరిగింది. మళ్లీ ఇటీవల మంత్రిమండలి సమావేశంలో మంత్రుల మార్పు విషయాన్ని లేవనెత్తి.. మరోసారి తన సహచర మంత్రుల అసహనానికి గురయ్యారు ముఖ్యమంత్రి జగన్‌ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయనకు పదవి ఇవ్వలేదని.. ఒంగోలులో అనుచరులు ఆందోళనలు చేశారు.

ex ministers feels bad for not placing them in new cabinet
అసంతృప్తికి కారణమయ్యారు.. అసమ్మతిగా మిగిలిపోయారు

No berth to Balineni: మంత్రివర్గంలోని అందరూ రాజీనామాలు చేశారు. సామాజిక కారణాల దృష్ట్యా ఒకరో ఇద్దరో మళ్లీ కొనసాగుతారని సీఎం చెప్పడంతో అంతా సర్దుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అలాగే అనుకున్నారు. కానీ, ఇప్పుడు పాత మంత్రుల్లో 11 మంది మళ్లీ కొత్త కేబినెట్‌లో స్థానం పొందగలిగారు. బాలినేనికి మాత్రం రిక్తహస్తం మిగిలింది. ఒంగోలు జిల్లాలో తనను పక్కనపెట్టి, తనతోపాటు మంత్రిగా చేసిన మరొకరిని ఇప్పుడు కొనసాగించడం ఆయనకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. తొలగిస్తే ఇద్దరినీ తొలగించండి, లేదా ఇద్దరినీ కొనసాగించండి అని ఆయన ఇప్పటికే రెండు మూడు దఫాలుగా ముఖ్యమంత్రి ముందే తన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.

కానీ చివరికి అసమ్మతితో మిగిలిపోయారు. మంత్రి పదవులు దక్కని ఆశావహుల అసమ్మతికీ ఆద్యుడయ్యారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి కూడా బాలినేనిని కలిసినట్లు తెలిసింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, కొండెపి వైకాపా బాధ్యుడు వెంకయ్య సైతం శ్రీనివాసరెడ్డిని పరామర్శించినట్లు సమాచారం.

నన్నింత అవమానిస్తారా?:‘నన్నింత అవమానిస్తారా? అందరినీ తీసేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తారా? నేను పార్టీ కోసం పనిచేయలేదా? జిల్లాలో పార్టీకి అన్నీ నేనై చూసుకోవడం లేదా? వ్యయ ప్రయాసల కోర్చి పనిచేయడం లేదా?’అని బాలినేని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సజ్జల, శ్రీకాంత్‌ బుజ్జగించడంలో భాగంగా.. ‘మీరు సీనియర్‌, సీఎం బంధువు కూడా. సర్దుకుపోతే బాగుంటుంది. మీరు అసమ్మతితో ఉంటే ఇతరులపైనా దీని ప్రభావం పడుతుంది కదా?’అని చెప్పినట్లు తెలిసింది. దీనికి బాలినేని స్పందిస్తూ.. ‘కేబినెట్‌లో మిగిలిన ముగ్గురు(తన సామాజికవర్గం) మంత్రుల్లో ఇద్దరిని మళ్లీ తీసుకున్నారంటే అర్థం ఏంటి? అంటే నేను అసమర్థుడిననా? కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా నాలుగేళ్ల పదవీకాలాన్ని వదులుకుని వచ్చి మరీ పార్టీ(వైకాపా) కోసం నిలబడలేదా?’అని తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ‘మూడు నాలుగు జిల్లాల్లో పార్టీని లీడ్‌ చేసేలా మీకు ప్రాంతీయ స్థాయి సమన్వయకర్తగా పెద్ద హోదాను ఇవ్వనున్నారు కదా?’అని సజ్జల బాలినేనికి చెప్పినట్లు తెలిసింది. ఇలా గంటపాటు చర్చలు జరిగినా బాలినేని మెత్తబడలేదని సమాచారం. సోమవారం కూడా ఆయనతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది.

షర్మిలతో బాలినేని సమావేశం..!తీవ్ర అసహనంతో ఉన్న బాలినేని సోమవారం మరి కొద్దిమంది ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్‌ సోదరి షర్మిలతో భేటీ అవనున్నారని.. ఆదివారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది.

మధ్యాహ్నం :ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్‌ను తిరిగి కొత్త కేబినెట్‌లోకి తీసుకుంటున్నారన్న వార్తలు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) నుంచి బయటకు పొక్కడంతో బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలోని బాలినేని ఇంటికి వెళ్లి తుది జాబితాలో సురేష్‌ పేరు ఉండబోదని బుజ్జగించినట్లు తెలిసింది. అప్పటికప్పుడు సురేష్‌ స్థానంలో ఆయన బావ డాక్టర్‌ తిప్పేస్వామిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు వైకాపా సొంత ఛానెల్‌లో ప్రచారం చేశారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మంత్రే లేనట్లయింది. పార్టీకి పట్టున్న అలాంటి జిల్లా నుంచి మంత్రి లేకపోవడమేంటని మళ్లీ హడావుడిగా జాబితాలో మార్పు చేసి సురేష్‌ పేరు చేర్చారు.

రాత్రి:జాబితాలో సురేష్‌ పేరుతో బాలినేని తీవ్రంగా అసంతృప్తి చెందారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాలనేంత తీవ్రస్థాయి నిర్ణయానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎంఓ సూచనతో ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి బాలినేని ఇంటికి వెళ్లి బుజ్జగింపు ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన తన నిర్ణయాన్ని మీడియా ముందు వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో అక్కడకు చేరుకున్న శ్రీకాంత్‌ ఆయన్ను ఇంట్లోకి లాక్కుని వెళ్లి మాట్లాడారు. వెంటనే సజ్జల కూడా అక్కడకు చేరుకుని మరోసారి చర్చించారు. గంటకుపైగా భేటీలో ముఖ్యమంత్రి నిర్ణయంపై వారు ఆయనకు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారని సమాచారం.

ఇదీ చదవండి:

బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు: సజ్జల

ABOUT THE AUTHOR

...view details