ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లలో జులై, ఆగస్టు నెలల పంపిణీని పరిశీలిస్తే సుమారు 80వేల వరకు తేడా కనిపిస్తోంది. జులైలో 60 లక్షల52 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టులో కొత్తగా 3లక్షల 10 వేల మందికి మంజూరు చేసినట్లు పేర్కొంది. ఆ లెక్కన ఆగస్టు నెల పింఛన్ల సంఖ్య 63 లక్షల 60 వేలకు చేరాలి. కానీ ఆగస్టు 1న చేపట్టే పంపిణీలో 62 లక్షల80 వేల మందికి అందించేందుకు 15 వందల 96 కోట్ల 77 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు ఆదివారం ప్రభుత్వం ప్రకటించింది. అంటే గత రెండు నెలల్లో పింఛన్ల సంఖ్యలో 80వేల వరకు తేడా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెలా 20వేల మంది వరకు చనిపోతూ ఉంటారనేది అధికారుల అంచనా. ఆ ప్రకారం చూసినా ఇంకా 60వేల వరకూ తేడా ఉంది.
మే 1న 60 లక్షల 88 వేల మందికి, జూన్ 1న 60 లక్షల 75 వేల మందికి, జులై 1న 60 లక్షల50 వేల మందికి పింఛన్లు అందించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఏ నెలకు ఆ నెల విడుదల చేసిన ప్రకటనల్లో తెలిపింది. 3 నెలల్లో పింఛన్ల పంపిణీ తీరును పరిశీలిస్తే 15వేల నుంచి 25వేల వరకు తగ్గుదల ఉంది. ఆ మేరకు ప్రతి నెలా సాధారణంగా చనిపోయిన వారుంటారు. అదే ప్రకారమే ఆగస్టులోనూ తగ్గుదల ఉండాలి. కానీ 80వేల వరకు సంఖ్య తగ్గింది. జులై నెలలో 60లక్షల 52 వేల మందికిగానూ 60 లక్షల మందికి పింఛను సాయాన్ని అందించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
పింఛన్ల సంఖ్యలో భారీ తేడాపై సెర్ప్ సీఈఓ ఇంతియాజ్‌ను వివరణ కోరగా.. 6 నెలలకు ఒకసారి 6 దశల్లో తనిఖీలు చేస్తుంటామని.. వాటిలో అనర్హులుగా తేలిన కొందరి పింఛన్లను తొలగించి ఉండవచ్చని తెలిపారు.