పేదలకు పట్టా భూమి పేరుతో మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ప్రజల సొమ్ము తినేశారని దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 9వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టగా.. వాటిలో 3 వేల కోట్లకుపైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ బాగోతంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తే, జగన్ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
పేదలకు భూమి పేరుతో ప్రజల సొమ్ము తినేశారు: దేవినేని ఉమ
జగన్ ప్రభుత్వం తన అసమర్థతను, చేతగానితనాన్ని ప్రతిపక్షంపై నెట్టాలని చూస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కాస్త ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలుస్తాయన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆయన ప్రభుత్వానికే వర్తిస్తాయన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఆవ భూముల్లో రూ.500 కోట్ల వరకు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. అటవీ భూములు, పాఠశాలల స్థలాలు, చెరువులు, కొండలు, గుట్టలు, శ్మశానాలు, అసైన్డ్, ముంపు ప్రాంతాల్లోని భూములను పేదలకు ఇస్తున్నారని గుర్తు చేశారు. రమేశ్ ఆసుపత్రి అంశంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, కక్ష, ద్వేషంతో రమేశ్ ఆసుపత్రిపై పడిందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:'శిరోముండనం, విక్రమ్ హత్య కేసులపై ఎందుకు నోరు మెదపరు'