విజయవాడలోని హోల్‌సేల్ పూల మార్కెట్‌కు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పూలు రవాణా అవుతాయి. రైతులు నేరుగా బెజవాడ మార్కెట్‌కు పంట ఉత్పత్తులను పంపిస్తుంటారు. ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుండడం, కరోనా భయంతో కొనేందుకు వినియోగదారులు మొగ్గు చూపకపోవడంతో మార్కెట్ వెలవెలబోతోంది.
సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. గత ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా వివాహాలు అంతంత మాత్రంగానే జరిగాయి. ఈసారైనా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని భావించిన రైతులు, వ్యాపారులకు సీజన్ ఆరంభంలోనే గట్టిదెబ్బ తగిలింది. లాక్‌డౌన్ ప్రభావంతో శుభకార్యాలు దాదాపుగా నిలిచిపోయాయి. అష్టకష్టాలు పడి పూలను మార్కెట్‌కు తీసుకొస్తే కొనేవారు లేక టన్నుల కొద్ది పూలను పారబోయాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.