ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం.. ఏపీ ఉద్యోగ సంఘాల నేతల అత్యవసరంగా సమావేశమయ్యారు. 11వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, బకాయిల చెల్లింపు అంశాలపై కార్యవర్గ భేటీలో చర్చించినట్లు ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు(APJAC chairman bopparaju venkateswarlu on PRC) వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సాయంత్రం జేఏసీ తరఫున కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. 94 ఉద్యోగ సంఘాలతో ఇప్పటికే సమావేశమై కార్యాచరణను సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఉద్యోగులను ఆర్థిక మంత్రి చిన్నచూపు చూస్తున్నారని.. అసలు ఆయన ఉద్యోగ సంఘాలతో ఏ రోజైనా చర్చించారా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. దీనిపై ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.