కలియుగ వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడవాహన సేవ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకొంటారు. రోడ్డుమార్గాన తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.
సాయంత్రం 5.45 గంటలకు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొంటారు. 6.15 నిమిషాలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొంటారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం... స్వామివారి తీర్థ ప్రసాదాలు...వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించి రాత్రి 7.40 గంటలకు శ్రీపద్మావతి అతిథిగృహం చేరుకుంటారు.
గురువారం ఉదయం ఆరు గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు నాదనీరాజనం వేదికగా జరగుతున్న సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొంటారు. ఎనిమిది గంటల పదినిమిషాలకు తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న వసతిగృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
2004కు ముందు బ్రహ్మోత్సవాల గరుడసేవ రోజున శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. గరుడసేవ రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండటం... ప్రముఖుల భద్రత, భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2004 నుంచి బ్రహ్మోత్సవాల తొలిరోజు పెద్ద శేషవాహనం సమయంలో పట్టువస్త్రాలు సమర్పించేలా మార్పులు చేశారు. కొవిడ్ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతుండటం... వాహన సేవలు ఆలయ ప్రాకారానికే పరిమితమవడంతో 2004కు ముందు సంప్రదాయాన్ని అనుసరిస్తూ జగన్మోహన్‌రెడ్డి గరుడసేవ రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు