తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు వెంకటగిరి కొండపై సుమారు 200 ఇళ్లు ఉన్నాయి. పాతికేళ్ల క్రితమే ఇక్కడ ఉండే పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వం పట్టాలిచ్చింది. స్థానికంగా సుద్దకొండగా పిలుచుకొనే ఈ కొండపై గతంలో గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా సాగేవి. స్థానికులు నిత్యం ఆందోళనలు చేసేవారు. ఆ తర్వాత తవ్వకాలు ఆపేశారు. అయితే కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తోపాటు...గోదావరి తాగునీటి శుద్ధి ప్లాంటు నుంచి నీటిని కిందకు వదలడం వల్ల కొండమట్టి కరిగిపోతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.
కొండపై ఉన్న ఇళ్లకు సమీపంలోనే 33కేవీ లైన్ విద్యుత్ టవర్లు ఉన్నాయి. టవర్లకు సమీపంలోనూ మట్టి జారిపోతోంది. ఒకవేళ టవర్ కనుక ఒరిగితే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.