ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన యువకుడికి వైరస్ నిర్థరణ రాష్ట్రంలో కరోనా వైరస్ తొలి పాజిటివ్ కేసు నమోదైంది. గత నెల 24న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన యువకుడికి... కరోనా ఉన్నట్లు నిర్థరించారు. అతని రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం 3రోజుల కిందట తిరుపతి స్విమ్స్ వైద్యశాలకు పంపారు. ఆ నివేదికలో ప్రిజిమ్యూడ్ పాజిటివ్ అని వచ్చింది.
పూర్తిస్థాయి నిర్ధరణ కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగానికి పంపారు. ఆ నివేదికలోనూ యువకుడికి వైరస్ ఉన్నట్లు నిర్ధరించారు. బాధితుడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కువైట్ నుంచి నెల్లూరుకు వచ్చిన మరో మహిళకు వైరస్ లేదని తేలింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తితిదే అప్రమత్తమైంది. ఇప్పటికే కొండపై పరిసరాలను ప్రతి రెండు గంటలకోసారి సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. తాజాగా అలిపిరితో పాటు శ్రీవారి పాదాల మెట్టు వద్ద ఇవాళ్టి నుంచి థర్మల్‌గన్‌తో తనిఖీలు నిర్వహించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. భక్తులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అదనపు ఈవో ధర్మారెడ్డి సూచించారు.
ప్రజలు వినియోగించే మాస్కులు అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకున్నట్లు డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. కరోనా వైరస్ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ శ్రీకాకుళంలో విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చదవండీ... 'రాజధాని భూముల పంపిణీ సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధం'