కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నించిన బడుగు నాగేశ్వరరావు తెదేపాకు చెందిన వ్యక్తి అని వైకాపా దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో పంట నష్టం పరిశీలనకు వచ్చిన ఆయన... భవన నిర్మాణ కార్మికుడు ఆవేదనతో దాడి చేస్తే తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం సమంజసం కాదన్నారు. 18 నెలల పాలనలో వైకాపా ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులు విసిగిపోయారని స్పష్టం చేశారు.
వైకాపా నేతలు సృష్టించిన ఇసుక కృత్రిమ కొరతతో 60 మంది కార్మికులు మరణించారని... దీనిపై వైకాపా నాయకులు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడికి వైకాపా ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. గతంలో తనపై అక్రమంగా హత్యా నేరం మోపారని రవీంద్ర చెప్పారు. వైకాపా నాయకులు ఇప్పటికైనా బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు.