యువతిపై సెక్యూరిటీ గార్డు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. యువతిని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకోవాలని ప్రయత్నించగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో చివరికి అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ యువతి కుటుంబసభ్యులు టీబీ వార్డులో చేరడంతో ఆమె సహాయకురాలు ఉన్నారు. ఈ వార్డు వద్ద సెక్యూరిటీ గార్డు సంతోష్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ యువతి తన స్నేహితుడితో తిరగడాన్ని గమనించాడు. ఒక రోజు ఆమె వద్దకెళ్లి బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించాడు. నీ స్నేహితుడిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పగా ఆమె భయపడింది. తన ద్విచక్ర వాహనంపై పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పడంతో ఆమె అతనితో వెళ్లింది. అతను బయట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లకుండా కొన్ని గంటల తర్వాత తిరిగి ఆస్పత్రి వద్ద దించి వెళ్లాడు. దీనిపై బాధితురాలు సెక్యూరిటీ పర్యవేక్షకుడు నాయుడుకు ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని బెదిరించాడని, అసభ్యకరంగా మాట్లాడాడని ఫిర్యాదు చేయడంతో అతడిని సోమవారం ఉద్యోగంలో నుంచి తొలగించారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పగా తన పరువు పోతుందని చెప్పడంతో చివరికి ఆసుపత్రి అధికారులు గుత్తేదారుడి దృష్టికి తీసుకెళ్లారు.
పలువురికి నేరప్రవృత్తి
ఆసుపత్రిలో కొందరు నేరప్రవృత్తి ఉన్న రక్షణ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గుత్తేదారు వారి ప్రవర్తన గురించి తెలుసుకోకుండా డబ్బులకు ఆశపడి ఉద్యోగాలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ పర్యవేక్షణ అధ్వానంగా ఉంది. ఆసుపత్రిలో ఓ అధికారే గుత్తేదారుడికి కొంత పర్సంటేజీ ఇచ్చి బినామీ పేరుతో బిల్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు గుత్తేదారుడికి అర్హత లేకున్నా ఓ ప్రజాప్రతినిధి కాంట్రాక్టు ఇప్పించారని తెలిసింది.